భయం వద్దు.. నైపుణ్యమే హద్దు | Pakistan to Anthropic How Aiza Usman Proves AI Is Opportunity Not Fear | Sakshi
Sakshi News home page

భయం వద్దు.. నైపుణ్యమే హద్దు

May 8 2026 3:49 PM | Updated on May 8 2026 4:20 PM

Pakistan to Anthropic How Aiza Usman Proves AI Is Opportunity Not Fear

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తోంది. కోడింగ్ నుంచి కంటెంట్ క్రియేషన్ వరకు, కస్టమర్ సర్వీస్ నుంచి రిక్రూట్‌మెంట్ వరకు ప్రతి రంగాన్ని ఏఐ తన గుప్పిట్లోకి తీసుకుంటోంది. ఈ వేగవంతమైన మార్పులను చూసి ఒకవైపు యువత ఆందోళన చెందుతుంటే, మరోవైపు దీనిని అవకాశంగా మలుచుకుని అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు కొందరు నిపుణులు. పాకిస్థాన్‌కు చెందిన యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఐజా ఉస్మాన్ కథ దీనికి ఒక నిదర్శనం. ప్రపంచంలోని టాప్ ఏఐ కంపెనీలలో ఒకటిగా పేరొందిన ఆంత్రోపిక్‌లో ఉద్యోగం సాధించిన ఐజా, తన ప్రయాణాన్ని వివరిస్తూ.. ఏఐ పట్ల భయం కంటే దాన్ని అర్థం చేసుకోవడమే నేటి అవసరమని నొక్కి చెప్పారు.

ఎందుకు ఆంత్రోపిక్?

ప్రస్తుతం గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ వంటి దిగ్గజ సంస్థలు శక్తివంతమైన ఏఐ మోడల్స్ కోసం పోటీ పడుతున్న వేళ ఐజా మాత్రం ఆంత్రోపిక్‌ను ఎంచుకోవడానికి ఒక ప్రత్యేక కారణం ఉందని చెప్పింది. ‘చాలా కంపెనీలు కేవలం వేగం, శక్తివంతమైన వ్యవస్థల వైపు పరుగులు తీస్తుంటే ఆంత్రోపిక్ మాత్రం ఏఐ భద్రత, బాధ్యతాయుతమైన అభివృద్ధిపై దృష్టి పెడుతోంది. మానవాళికి సురక్షితమైన ఏఐని అందించడమే కంపెనీ లక్ష్యం. అదే నన్ను ఆకర్షించింది’ అని ఆమె పేర్కొన్నారు.

సాధారణ విద్యార్థినిగా పాకిస్థాన్ నుంచి అమెరికాకు వెళ్లిన ఐజా న్యూయార్క్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో తనకున్న పట్టుతో క్రమంగా ఏఐ వైపు మొగ్గు చూపారు. ముఖ్యంగా ప్రస్తుత ఏఐ బూమ్‌కు కారణమైన జనరేటివ్ ఏఐ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ట్రాన్స్‌ఫార్మర్ సిస్టమ్స్‌పై ఆమె ప్రత్యేక పరిశోధన చేశారు. కేవలం చదువుకే పరిమితం కాకుండా ఒక ఫిన్‌టెక్ స్టార్టప్‌లో ఏఐ ఏజెంట్లు తయారీపై ఆమె చేసిన ప్రాజెక్ట్ ఆంత్రోపిక్ వంటి అగ్రశ్రేణి సంస్థలో ఉద్యోగం సాధించడానికి కీలకమైందని వెల్లడించారు.

యువతకు సూచనలు

  • ఏఐ ఇప్పుడు కేవలం టెక్నికల్ టీమ్స్‌కే పరిమితం కాలేదు. హెల్త్‌కేర్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్‌ వంటి ప్రతి రంగంలోనూ ఇది భాగమైంది. అందుకే దాని నుంచి తప్పించుకోవడం కంటే దాన్ని నేర్చుకోవడమే ఉత్తమం.

  • కొత్త సాధనాలను ఎంత త్వరగా వాడటం నేర్చుకుంటే భవిష్యత్తు మార్కెట్‌లో అంతగా రాణించవచ్చు.

  • ఏఐ అనేది మీ పనిని సులభతరం చేసే సాధనమే తప్ప, మీకు శత్రువు కాదు. దాని పనితీరును అర్థం చేసుకుంటే మీ కెరీర్ మరింత భద్రంగా ఉంటుంది.

  • అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనల్ని మనం ఎలా మలుచుకోవాలో నిత్యం నేర్చుకోవాలి.

  • గ్లోబల్ జాబ్ మార్కెట్‌లో నిలదొక్కుకోవాలంటే పాత పద్ధతులకు అంటిపెట్టుకోకుండా కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement