వాష్టింగన్: అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేసిన జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఆ పత్రాల్లో భారత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పేరు కూడా ప్రస్తావనకు రావడం ఆసక్తి కలిగించింది. దీంతో ఎప్‌స్టీన్ లైంగిక నేరాల్లో అంబానీ ప్రమేయం ఉందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఆ ఫైల్స్‌ను పరిశీలిస్తే, అంబానీకి ఎప్‌స్టీన్‌తో ఉన్నది వ్యాపార సంబంధాలే తప్ప లైంగిక సంబంధాలు లేవని స్పష్టమైంది.
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో అంబానీ పేరు ప్రస్తావన రావడం ఆయన వ్యాపార సమస్యల సమయంలో ఎప్‌స్టీన్ ఇచ్చిన సలహాలు, అమెరికా రాజకీయ పరిణామాలపై సమాచారం, పరిచయాలకే పరిమితమైంది. లైంగిక నేరాల విషయంలో ఆయనపై ఎలాంటి ఆరోపణలు లేవని స్పష్టంగా తేలింది. అంటే, ఎప్‌స్టీన్ వ్యవహారంలో అంబానీ పేరు వినిపించడం ఆయన వ్యాపార సంబంధాల కోణంలో మాత్రమేనని, లైంగిక నేరాలకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదని ఈ పత్రాలు నిర్ధారించాయి.
అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఫైల్స్ ప్రకారం.. అనిల్ అంబానీ–జెఫ్రీ ఎప్‌స్టీన్ మధ్య 2017 నుండి 2019 వరకు సంభాషణలు జరిగాయి. ఈ చర్చలు ప్రధానంగా అమెరికా–భారత్ సంబంధాలు, ట్రంప్ ప్రభుత్వ విధానాలు, అలాగే అంబానీ ఎదుర్కొంటున్న వ్యాపార సమస్యలపై స్నేహపూర్వక సలహాల చుట్టూ తిరిగాయి. అంబానీతో పరిచయం పెంచుకోవడానికి, తాను వైట్ హౌస్‌లో లోపలి వ్యక్తి అని చూపించుకోవడానికి ఎప్‌స్టీన్ ప్రయత్నించినట్లు పత్రాలు సూచిస్తున్నాయి.
ట్రంప్ ప్రభుత్వ జాతీయ భద్రతా వ్యూహంలో భారత్ స్థానం ఏమిటో తెలుసుకోవాలని అంబానీ ఎప్‌స్టీన్‌ను సంప్రదించగా.. ‘వైట్ హౌస్‌లోని అంతర్గత సమాచారం అందిస్తాను’ అంటూ ఎప్‌స్టీన్ స్పందించాడు. అలాగే ట్రంప్ నియామకాలపై ముందుగానే సమాచారం ఇచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఉదాహరణకు, 2017లో అంబానీ, డేవిడ్ పేట్రేయస్‌ను భారత్‌కు అమెరికా రాయబారిగా నియమిస్తారా అని అడిగితే, ఎప్‌స్టీన్ లేదని అని చెప్పాడు. అన్నట్లుగా ఆ పదవి కెన్నెత్ జస్టర్‌కు దక్కింది.
తనకి ట్రంప్ సన్నిహితులు స్టీఫెన్ బానన్, థామస్ బారాక్‌లను పరిచయం చేయాలని ఎప్‌స్టీన్ సూచించాడు. వ్యాపార సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో ‘మానసికంగా బలంగా ఉండాలి’ అని సలహా ఇచ్చాడు. నీతో పరిచయం .. డబ్బు కోసం కాదు, స్నేహితుడిగా మాత్రమే’అని పలుమార్లు చెప్పాడు.
2019 ఏప్రిల్‌లో అంబానీ ‘ట్రాన్సాక్షన్ పూర్తయింది.. కాఫీకి వస్తాను’ అని మెయిల్ పంపించారు. మే 23న న్యూయార్క్‌లోని ఎప్‌స్టీన్ ఇంట్లో ఇద్దరూ కలుసుకున్నారు. ఆ తర్వాత కూడా వారు సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ఎన్‌క్రిప్టెడ్ ప్లాట్‌ఫారమ్‌లలో మాట్లాడుకున్నారు. అంబానీ ‘ఆర్మనీఏ’ అనే హ్యాండిల్‌తో కనెక్ట్ అయ్యారు.
ఎప్‌స్టీన్ అరెస్టుకు మూడు రోజుల ముందు వరకు ఈ సంభాషణలు కొనసాగాయి. ముఖ్యంగా, అనిల్ అంబానీపై ఎటువంటి లైంగిక దుర్వినియోగ ఆరోపణలు లేవని న్యూయార్క్ టైమ్స్ స్పష్టంచేసింది. ఈ సంబంధం వ్యాపార సమస్యల సమయంలో ఎప్‌స్టీన్ ఇచ్చిన సలహాలు, అమెరికా రాజకీయ పరిణామాలపై సమాచారం అనే కోణంలో మాత్రమే నిలిచింది.


