ఇరాన్ దాడుల్లో ఎఫ్–15ఇ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే.. ఆ విమానంలో గల్లంతైన మరో పైలెట్ ఆచూకీ లభ్యమైంది. దాదాపు 36 గంటల తర్వాత పైలట్ ఆచూకీ లభించింది. పైలెట్‌ను అమెరికా భద్రతా బలగాలు రక్షించాయి. గల్లంతైన ఎఫ్-15ఈ ఫైటర్ జెట్ రెండో పైలట్ సేఫ్ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. దేశ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్ విజయవంతమైందన్నారు.
‘‘ప్రస్తుతం పైలట్ అమెరికా బలగాల అధీనంలోనే ఉన్నారు. ఇరాన్‌లోని ప్రమాదకరమైన పర్వతాల్లో పైలట్‌ను గుర్తించారు. రక్షణ చర్యలకు ఆటంకం కలగకూడదనే బహిర్గతం చేయలేదు. శత్రు భూభాగంలోకి వెళ్లి ఎయిర్‌మెన్‌ను రక్షించడం చాలా గొప్ప విషయం. ఏ అమెరికన్ యోధుడిని ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టం. ఇరాన్ గగనతలంపై అమెరికా తిరుగులేని ఆధిపత్యం సాధించింది’’ అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు.
శుక్రవారం నాటి ఇరాన్ దాడుల్లో ఎఫ్–15ఇ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానంతో పాటు కె–10 వార్ థగ్ ఫైటర్ జెట్‌ను కూడా అమెరికా కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే, ‘‘కె–10 తాలూకు శకలాలు కువైట్ భూభాగంలో పడ్డాయి. దాంతో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ఎఫ్–15ను ఇరాన్ తమ గగనతనంలోనే వేయగా.. అందులోని ఓ పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. వారు నైరుతి ఇరాన్‌లోని కొగిలుయె, బోయర్–అహ్మద్ కొంత ప్రాంతంలో కిందకు దూకారు. అమెరికా ప్రత్యేక సైనిక దళాలు వెంటనే రంగంలోకి దిగి వారిలో ఒకరిని కాపాడి తీసుకెళ్లాయి. గల్లంతైన రెండో పైలట్ కోసం శనివారం కూడా ముమ్మర గాలింపు కొనసాగింది. ఆ పైలెట్ ఆచూకీ లభించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా తెలిపారు.

కాగా, హార్మూజ్ జలసంధిని మరో 48 గంటల్లో బేషరతుగా తెరవాలని ఇరాన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ‘‘హార్మూజ్‌ను తెరిచేందుకు మీకిచ్చిన గడువు ఏప్రిల్ 6తో ముగుస్తోంది. ఆలోపే ఒప్పందానికి రండి. లేదంటే భారీ దాడులతో మీకు అక్షరాలా నరకం చవిచూపిస్తాం’’అంటూ బెదిరింపులకు దిగారు. అయితే, ఇరాన్ శక్తిసామర్థ్యాలు గొప్పవంటూ ఈ సందర్భంగా ట్రంప్ అంగీకరించడం విశేషం. ‘ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశాల్లో ఒకదానితో 32 రోజులుగా మేం సైనిక పోరాటం చేస్తున్నాం’అని ఆయన చెప్పుకొచ్చారు.


