న్యూఢిల్లీ: నెక్స్ట్-జనరేషన్ అమృత్ భారత్ కోచ్‌ల అంతర్గత భాగాల అప్‌గ్రేడేషన్ జరుగుతోంది. శాంపిల్ కోచ్ సిద్ధమైంది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా న్యూఢిల్లీ స్టేషన్‌లో ప్రతిపాదిత అంతర్గత డిజైన్, రంగులతో అభివృద్ధి చేసిన నెక్స్ట్-జనరేషన్ అమృత్ భారత్ కోచ్‌ల శాంపిల్ కోచ్‌ను పరిశీలించారు. ప్రయాణికులకు మంచి సౌకర్యం, ఆకట్టుకునే రూపం, మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా ఈ మోడల్ కోచ్‌ను రూపకల్పన చేశారు.
పీవీసీ ఫ్లోరింగ్, సీటు, బెర్త్ రెక్సిన్, స్నాక్ టేబుళ్లు, కర్టెన్లు, లావేటరీ ప్రాంతాలు వంటి ముఖ్య భాగాల్లో వాటికి తగ్గ రంగులతో ప్రత్యేక అంతర్గత రంగుల థీమ్‌లు ఏర్పాటు చేశారు. ఈ కోచ్‌లలో వాడిన అన్ని పదార్థాలు హెచ్ఎల్ 3 అగ్నిప్రమాదాలు చోటుచేసుకోకుండా భద్రత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి.

హెచ్ఎల్3 (హజార్డ్ లెవల్ 3) యూరోపియన్ రైల్వే స్టాండర్డ్ ఈఎన్ 45545-2కి అనుగుణంగా వీటి రూపకల్పన చేస్తున్నారు. హజార్డ్ లెవల్ 3 అంటే అగ్ని ప్రమాదంలో పదార్థాల భద్రత స్థాయి కొలిచే అత్యున్నత ప్రమాణం. ఈఎన్ 45545-2 అంటే యూరోపియన్ రైల్వే అగ్ని భద్రత ప్రమాణాల నియమావళి.

ఈ రైళ్లకు వాడుతున్న ఈ కలర్ స్కీమ్ ఆధునిక రూపాన్ని ఇస్తూ దీర్ఘకాలికంగా మన్నికగా ఉండేలా చేస్తుంది. నిర్వహణ కూడా సులభతరంగా ఉంటుంది. రైల్వేలో ఉపయోగించే అన్ని రకాల బోగీలు, లోకోమోటివ్‌లను ఆధునికీకరించారు. ఈ సూపర్‌ఫాస్ట్ ప్రయాణికుల రైలులో పీవీసీ ఫ్లోరింగ్ నుంచి రెక్సిన్ సీటు బెర్త్‌లు, స్నాక్ టేబుళ్లు, కర్టెన్లు, మరుగుదొడ్డి వరకు వాటికి తగ్గ రంగుల ప్యాలెట్‌లు వేయడంతో ఈ రైలు చూడగానే ఆకట్టుకుంటోందది.
ప్రయాణికుల భద్రత, మెరుగైన సౌకర్యాల కోసం కొత్త డిజైన్‌లు, మెరుగైన మరుగుదొడ్డి సౌకర్యాలతో కోచ్‌ల శాంపిల్స్ సిద్ధం చేశామని, ఉన్న కోచ్‌ను మెరుగుపరచి నమూనా కోచ్‌గా తయారు చేశామని అశ్విని వైష్ణవ్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
🚆 Passengers की सुरक्षा और सुविधा बढ़ाने के लिए रेलवे ने नए डिज़ाइन के coach और बेहतर टॉयलेट्स के मॉडल तैयार किए हैं। मौजूदा coach को अपग्रेड कर एक सैंपल coach तैयार किया गया है। pic.twitter.com/nIXwplAI5A
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) April 4, 2026


