వాషింగ్టన్: ఇరాన్ పవర్ ప్లాంట్లు, బ్రిడ్జ్‌లపై దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్‌కు ఆయన ఇచ్చిన గడువు ముగుస్తుండడంతో తన ట్రూత్ సోషల్ మీడియా ట్రూత్‌లో ఓ ప్రకటన చేశారు.
‘ఇరాన్‌లో మంగళవారం పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే.. అన్నీ ఒకేసారి ఉండబోతున్నాయి. అలాంటి డే మరొకటి ఉండదు.. ఆ స్ట్రైట్ (హార్మూజ్ జలసంధి) తెరవండి, పిచ్చి దుర్మార్గుల్లారా.. లేకపోతే మీరు నరకంలో జీవిస్తారు.. చూడండి..’ అని అన్నారు.
హార్మూజ్ జలసంధి తెరవాలని ట్రంప్ చాలా రోజుల నుంచి ఇరాన్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ జలమార్గం ద్వారా నౌకల రాకపోకలు దాదాపు ఆగిపోవడంతో చమురు ధరలు పెరిగాయి. అమెరికా బెదిరింపులకు ఇరాన్ ఏ మాత్రం బెదరడం లేదు.
హార్మూజ్ జలసంధి తెరవాలని లేదంటే భీకర దాడులు చేస్తామని ట్రంప్ మొదటి నుంచి హెచ్చరిస్తున్నారు. హార్మూజ్ జలసంధిపై రాకపోకలు సులభతరం చేయడం కోసం ఒమన్, ఇరాన్ ఇవాళ (ఏప్రిల్ 5) చర్చలు నిర్వహించాయని ఒమన్ ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది.
"ఒమన్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రెండు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖలు సమావేశం నిర్వహించాయి, ఇరుపక్షాల నిపుణులు హాజరయ్యారు. హార్మూజ్ ద్వారా సజావుగా రాకపోకలు జరిగేలా అవకాశాలను సృష్టించడంపై చర్చించారు" అని ఆ వార్తా సంస్థ ఎక్స్‌లో పేర్కొంది. ఇరుపక్షాల నిపుణులు దీనిపై అనేక ప్రతిపాదనలు ముందుకు తెచ్చారని పేర్కొంది.


