ట్రంప్‌నకు మరో షాకిచ్చిన ఇరాన్‌? | Iran reports Says IRGC downed by C-130 of US Air Force | Sakshi
Sakshi News home page

ట్రంప్‌నకు మరో షాకిచ్చిన ఇరాన్‌?

Apr 5 2026 11:04 AM | Updated on Apr 5 2026 1:15 PM

Iran reports Says IRGC downed by C-130 of US Air Force

టెహ్రాన్‌: ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధం కొనసాగుతోంది. అయితే, ఈ యుద్ధంలో అమెరికాకు భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్‌ టార్గెట్‌ చేసి కూల్చివేస్తోంది. ఇందులో భాగంగానే మరో అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్టు ఇరాన్‌ సంచలన ప్రకటన చేసింది.

ఇరాన్‌ ఆదివారం ఓ ప్రకటనలో మరో అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ప్రకటించింది. అమెరికా వైమానిక దళానికి చెందిన C-130 అనే యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియా నివేదించింది. ఇస్ఫహాన్‌ దక్షిణ భాగంలో కూల్చివేసినట్టు తెలిపింది. అయితే, F-15E పైలట్‌ను స్వదేశానికి రప్పించేందుకు జరుగుతున్న గాలింపు, సహాయక చర్యల మధ్య, ఇస్ఫహాన్ గగనతలంపై మరో అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.

ఇక, అంతకుముందు... ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికాకు చెందిన యుద్ధ విమానం ‘F-15E స్ట్రైక్‌ ఈగల్‌’ కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గల్లంతైన రెండో పైలట్‌ను తాజాగా అమెరికా దళాలు గుర్తించి.. రక్షించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దేశ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్‌ను తమ సైన్యం విజయవంతంగా పూర్తి చేసిందన్నారు.

ప్రస్తుతం అతడు అమెరికా బలగాల ఆధీనంలోనే సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ఇరాన్‌లోని ప్రమాదకరమైన పర్వతాల్లో అతడిని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఓ వైపు శత్రువులు అతడి కోసం వేట సాగిస్తుంటే.. మరోవైపు అతడి కమాండర్‌ ఇన్‌ చీఫ్‌, యుద్ధ కార్యదర్శి, జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌, ఇతర అమెరికా యోధులు అతడి లొకేషన్‌ను 24 గంటలూ గమనిస్తూనే ఉన్నారని ట్రంప్‌ వెల్లడించారు. పైలట్‌ను తీసుకురావడానికి తాను డజన్ల కొద్దీ విమానాలను పంపానని.. తమ రక్షణ చర్యలకు ఆటంకం కలగకూడదనే ఈ విషయాన్ని బహిర్గతం చేయలేదని ట్రంప్ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement