ప్రపంచం వేగంగా మారుతోంది. గతంలో మాంద్యం, కరోనా మహమ్మారి వంటి పరిస్థితులు అన్ని రంగాలపై ఒకేలా ప్రభావం చూపలేదు. అదే విధంగా.. ప్రస్తుతం జరుగుతున్న AI కూడా ప్రతి ఉద్యోగాన్ని సమానంగా ప్రభావితం చేయదు. ఈ పరిస్థితుల్లో నిలబడే వారు ఎవరు అంటే?.. తమ ఉద్యోగాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నవారు. ముఖ్యంగా.. యంత్రాలు పూర్తిగా భర్తీ చేయలేని పనులను చేసే వారు భవిష్యత్తులో విజయవంతంగా ముందుకు సాగుతారు.
AI సులభంగా చేసే పనులు
➤డేటా ప్రాసెసింగ్
➤ప్యాటర్న్ గుర్తింపు
➤కంటెంట్ తయారీ
➤నియమాల ప్రకారం పనిచేయడం
వీటన్నింటిని ఏఐ సులభంగా చేయగలదు. అంటే.. ఇలాంటి ఉద్యోగాల్లో ఉన్నవారు ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ఉత్తమం. లేదా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం మంచిది. లేకుంటే ఏ సమయంలో అయినా ఉద్యోగం కోల్పోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే.
AI చేయలేని పనులు
AI ఎంత అభివృద్ధి చెందినా.. అన్ని రంగాల్లో, అన్ని పనులను చేస్తుందని అనుకోవడం పొరపాటు. కాబట్టి ఏఐ సమర్థవంతంగా చేయలేని పనులు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో..
భావోద్వేగ నైపుణ్యం: మనుషుల భావాలు అర్థం చేసుకోవడం, అనుభూతి చెందడం AIకు కష్టం.
నిర్ణయాలు: నైతికత, అనుభవం, పరిస్థితుల ఆధారంగా తీసుకునే నిర్ణయాలు AIకి సవాలు.
ఉన్నత స్థాయి క్రియేటివిటీ: “ఏం చేయాలి?” అనే ఆలోచన మనిషి దగ్గరే ఉంటుంది. కాబట్టి ఏఐ సొంతంగా ఆలోచించలేదు.
అనూహ్య పరిస్థితుల్లో నైపుణ్యం: ఉదాహరణకు.. ఒక ప్లంబర్ పని. ప్రతిసారీ ఒకే సమస్య తలెత్తదు. ప్రతిసారీ కొత్త సమస్య పుడుతుంది.
సురక్షితమైన ఉద్యోగాలు / AI ప్రభావం తక్కువగా ఉండే రంగాలు
➜హెల్త్‌కేర్: డాక్టర్లు, నర్సులు, థెరపిస్టులు
➜ట్రేడ్స్: ఎలక్ట్రిషియన్, ప్లంబర్, మెకానిక్
➜మెంటల్ హెల్త్: కౌన్సిలర్, సైకాలజిస్టు
➜AI రంగం: AI ఇంజనీర్, ప్రాంప్ట్ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ
➜కాంప్లెక్స్ సర్వీసెస్: లాయర్లు, స్ట్రాటజిస్టులు
➜క్రియేటివ్ రంగం: బ్రాండ్ స్ట్రాటజీ, కంటెంట్ డైరెక్షన్
ఏఐ అధికంగా విజృంభిస్తున్న కాలంలో.. ఏ మాత్రం భయపడకుండా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఈ రోజుల్లో కేవలం డిగ్రీ ఉంటే.. ఉద్యోగం సురక్షితంగా ఉంటుందనుకోవడం పొరపాటు. ఏఐ కూడా ఎదుర్కోలేని రంగాన్ని మీరు ఎంచుకోవాలి. అప్పుడే ముందుకు వెళ్లగలరు.


