
గ్రేటర్‌లో చ.అ.కు ప్రారంభ ధర రూ.5,800
బాచుపల్లి, తెల్లాపూర్, గండిపేట,మియాపూర్ ప్రాంతాలకు డిమాండ్
అందుబాటు ధరలలోని ఇళ్ల విక్రయాలలో అత్యధిక వృద్ధి
సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు దేశంలోని మెట్రో నగరాలతో పోలిస్తే మన నగరంలోనే అపార్ట్‌మెంట్ల ధరలు తక్కువగా ఉండేవి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. దేశంలో ముంబై తర్వాత ఖరీదైన సిటీగా మన నగరం అభివృద్ధి చెందింది. రెండో అత్యంత ఖరీదైన నగరంగా మారిపోయింది.
వార్షిక ప్రాతిపదికన హైదరాబాద్‌లో ప్రాపర్టీల విలువ 6 శాతం వృద్ధి చెంది.. చ.అ. ధర సగటున రూ.5,800 నుంచి రూ.6 వేలకు పెరిగింది. ముంబైలో ఏడాదిలో 3 శాతం పెరిగి.. రూ.9,600 నుంచి రూ.9,800లకు చేరిందని ప్రాప్‌టైగర్.కామ్ నివేదిక వెల్లడించింది.
దాదాపు పదేళ్ల కాలంలో అతి తక్కువ గృహ రుణ వడ్డీ రేట్లు ఉండటం, స్టాంప్ డ్యూటీలను తగ్గించడం, సర్కిల్ ధరలలో సవరణలతో పాటు గృహ కొనుగోళ్లలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలతో అందుబాటు ధరలలోని ఇళ్ల విక్రయాలలో అత్యధిక వృద్ధి నమోదైంది.
ఒకవైపు సిమెంట్, స్టీలు వంటి నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ.. నిర్మాణ సంస్థలు కొనుగోలుదారులకు రాయితీలను అందిస్తున్నాయి. లేదంటే ఆయా నగరాలలో ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదముంది.