ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం | RBI Surplus Transfer 2025 26 Record Rs 2 86 Lakh Cr Boost Govt Finances | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం

Jun 9 2026 4:15 PM | Updated on Jun 9 2026 4:18 PM

RBI Surplus Transfer 2025 26 Record Rs 2 86 Lakh Cr Boost Govt Finances

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) నుంచి కేంద్ర ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో మిగులు నిధుల బదిలీ (సర్‌ప్లస్‌ ట్రాన్స్‌ఫర్‌) ఊపందుకుంది. ఆర్థిక సంవత్సరం 2025-26లో ఆర్‌బీఐ ఏకంగా రూ.2,86,588.46 కోట్ల భారీ మిగులు నిధులను కేంద్రానికి బదిలీ చేసింది. ఇది మన దేశ జీడీపీలో 0.83 శాతానికి సమానం. గడచిన మూడేళ్లుగా ఈ బదిలీలు నిరంతరాయంగా భారీ స్థాయిలో సాగుతున్నాయి.

గత మూడేళ్ల బదిలీల గణాంకాలను పరిశీలిస్తే..

  • 2023-24: రూ.2,10,873.99 కోట్లు (జీడీపీలో 0.99%)

  • 2024-25: రూ.2,68,590.07 కోట్లు (జీడీపీలో 0.90%)

  • 2025-26: రూ.2,86,588.46 కోట్లు (జీడీపీలో 0.83%)

ఈ నిధుల బదిలీ ఆర్థికంగా ప్రభుత్వానికి ఎంతో ఊరటనిస్తున్నప్పటికీ దేశ ద్రవ్య వ్యవస్థ(మానిటరీ సిస్టమ్‌), లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)పై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై నిపుణులు కొన్ని అంశాలు పంచుకుంటున్నారు.

చట్టబద్ధమైన నిబంధనలు - ఆదాయ వ్యయాలు

ఆర్‌బీఐ చట్టం 1934లోని సెక్షన్ 47 ప్రకారం.. రిజర్వ్ బ్యాంక్ తన మొత్తం ఆదాయం నుంచి నిర్వహణ వ్యయాలు, అవసరమైన నిధుల కేటాయింపులు పోను మిగిలిన నికర ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయాల్సి ఉంటుంది.

ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది?

ఆర్‌బీఐకి దేశీయ వనరులతో పాటు విదేశీ వనరుల నుంచి వచ్చే వడ్డీలు, పెట్టుబడుల అమ్మకాలు/రిడెంప్షన్‌ ద్వారా లభించే లాభాల రూపంలో ఆదాయం వస్తుంది. 2025-26లో ఆర్‌బీఐ స్థూల ఆదాయం 26.42 శాతం పెరిగి రూ.4,27,684.15 కోట్లకు చేరింది. ఇందులో అత్యధికంగా 76.53 శాతం ఆదాయం విదేశీ వనరుల నుంచే రావడం గమనార్హం.

మరోవైపు ఆర్‌బీఐ మొత్తం వ్యయం (ఉద్యోగుల జీతాలు, కరెన్సీ ముద్రణ ఛార్జీలు, ఏజెన్సీ ఛార్జీలు మొదలైనవి) రిస్క్ ప్రొవిజన్లకు ముందు 27.60 శాతం పెరిగి రూ.1,41,091.69 కోట్లుగా నమోదైంది. రిస్క్ ప్రొవిజన్ల(భవిష్యత్తులో రాబోయే ఊహించని నష్టాలు లేదా ఆర్థిక సంక్షోభాలను తట్టుకోవడానికి ఆర్‌బీఐ తన లాభాల నుంచి ముందుగానే పక్కన పెట్టే రక్షణ నిధి)కు ముందు నికర ఆదాయం రూ.3,95,972.10 కోట్లుగా ఉండగా, మార్చి 31, 2026 నాటికి ఆర్‌బీఐ బ్యాలెన్స్ షీట్ సైజ్ 20.61 శాతం వృద్ధితో రూ.91,97,121.08 కోట్లకు చేరుకుంది.

రిస్క్ బఫర్ నిర్వహణ

సవరించిన ఆర్థిక మూలధన చట్రం (ఎకానామిక్‌ క్యాపిటల్‌ ఫ్రేమ్‌వర్క్‌-ECF) ప్రకారం.. ఆర్‌బీఐ తన బ్యాలెన్స్ షీట్ సైజులో 4.5% నుంచి 7.5% వరకు కంటింజెంట్ రిస్క్ బఫర్ (సీఆర్‌బీ-ఊహించని అత్యవసర ఖర్చులు) నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుత స్థూల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆర్‌బీఐ 2025-26లో ఏకంగా  రూ.1,09,379.64 కోట్లను సీఆర్‌బీకి మళ్లించింది (గత ఏడాది ఇది రూ.44,861.70 కోట్లు మాత్రమే). ప్రస్తుతం ఈ రిస్క్ బఫర్ లెక్కింపు ప్రకారం 6.5 శాతంగా ఉంది.

ద్రవ్య వ్యవస్థపై పర్యవసానాలు

ఆర్‌బీఐ వద్ద​ మిగులు నిధుల బదిలీ కేవలం అకౌంటింగ్ ప్రక్రియ మాత్రమే కాదు, దీనికి తీవ్రమైన ద్రవ్య ప్రాధాన్యత ఉంది. ఇది దేశ ద్రవ్య విధానంపై ప్రభావం చూపుతుంది.

రిజర్వ్ మనీ పెరగడం: దేశంలో ద్రవ్య సృష్టికి మూలమైన రిజర్వ్ మనీ లేదా బేస్ మనీతో దీనికి ప్రత్యక్ష సంబంధం ఉంది. ఆర్‌బీఐ బ్యాలెన్స్ షీట్‌లో లయబిలిటీల వైపు కరెన్సీ, బ్యాంకుల డిపాజిట్లు ఉంటే.. అసెట్స్ వైపు నెట్ డొమెస్టిక్ అసెట్స్ (ఎన్‌డీఏ-ప్రభుత్వానికి ఇచ్చే క్రెడిట్), నెట్ ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎన్‌ఎఫ్‌ఏ) ఉంటాయి.

లిక్విడిటీ: ఆర్‌బీఐ వద్ద ఈ మిగులు ఉన్నంత కాలం నిధులు ‘నాన్-మానిటరీ లయబిలిటీ’గా రిజర్వుల్లో ఉంటాయి. ఎప్పుడైతే వీటిని ప్రభుత్వానికి బదిలీ చేస్తారో అప్పుడు ఇవి ప్రభుత్వ డిపాజిట్లుగా మారతాయి. ప్రభుత్వం ఈ నిధులను వివిధ పథకాలు, అభివృద్ధి పనుల కోసం మార్కెట్లో ఖర్చు చేసినప్పుడు.. ఆ డబ్బు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తుంది. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) భారీగా పెరుగుతుంది. ఇది వ్యవస్థలోకి శాశ్వత లిక్విడిటీని ప్రవేశపెట్టడంతో సమానం.

రాబడిలో పెరుగుదల

కేంద్ర బడ్జెట్‌లో ఈ నిధులను పన్నేతర రాబడి కింద ‘డివిడెండ్లు, లాభాలు’ అనే పద్దులో చూపిస్తారు.

2025-26 బడ్జెట్ అంచనాలుసవరించిన అంచనాలుతుది సంఖ్య
రూ.3,25,000 కోట్లురూ.3,75,590 కోట్లురూ.3,80,136 కోట్లు

ఈ పెరిగిన రూ.55,136 కోట్లకు ప్రధాన కారణం ఆర్‌బీఐ బదిలీ చేసిన మిగులు నిధులే. 2025-26లో బదిలీ అయిన రూ.2,86,588.46 కోట్లు.. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పన్నేతర రాబడిలో ఏకంగా 43.01 శాతంగా నిలవనుంది. ఇది ఆర్‌బీఐ నిధులపై ప్రభుత్వ డిపెండెన్సీ ఏ స్థాయిలో పెరుగుతుందో సూచిస్తోంది. సాధారణ ప్రభుత్వ రంగ సంస్థల లాభాల బదిలీకి, ఆర్‌బీఐ మిగులు బదిలీకి చాలా తేడా ఉంటుంది. ఆర్‌బీఐ బదిలీ నేరుగా ప్రాథమిక ద్రవ్య విస్తరణకు దారితీస్తుంది.

ద్రవ్యోల్బణాన్ని పెంచుతుందా?

సాంకేతిక కోణంలో చూస్తే ఇది ద్రవ్యోల్బణానికి దారితీసే అంశాలాగా తోస్తుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ భారీ బదిలీల వల్ల వ్యవస్థలోకి వచ్చే అదనపు ద్రవ్యాన్ని రిజర్వ్ బ్యాంక్ సులువుగా విస్మరించలేదు. ప్రభుత్వానికి ఇది ఆర్థికంగా వెసులుబాటు కల్పించే అవకాశం అయినప్పటికీ, మార్కెట్లో మితిమీరిన ద్రవ్య లభ్యత వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణ ముప్పును అదుపు చేయడం ఆర్‌బీఐకి సవాలుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు

Advertisement
 
Advertisement
Advertisement