గోల్డ్‌ లోన్‌ కొత్త రూల్స్‌ ఖరారు.. | RBI releases final guidelines for Lending Against Gold and Silver Collateral | Sakshi
Sakshi News home page

గోల్డ్‌ లోన్‌ కొత్త రూల్స్‌ ఖరారు..

Jun 7 2025 7:49 PM | Updated on Jun 7 2025 8:49 PM

RBI releases final guidelines for Lending Against Gold and Silver Collateral

బంగారు, వెండి వస్తువులు, ఆభరణాల తాకట్టుపై ఇచ్చే రుణాలకు సంబంధించి నూతన మార్గదర్శకాలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఖరారు చేసింది. ఈ మేరకు బ్యాంకులు, ఇతర నియంత్రిత సంస్థలకు తుది మార్గదర్శకాలను జారీ చేసింది. 
 
అన్ని వాణిజ్య బ్యాంకులు (పేమెంట్ బ్యాంకులు మినహా), సహకార బ్యాంకులు (అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులు, సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకులు), బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌ఎఫ్‌సీలు), హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు (హెచ్ఎఫ్‌సీలు) ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి.

  • నూతన మార్గదర్శకాలు ఇవే.. 
    బ్యాంకులు, రుణ సంస్థలు గోల్డ్‌ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) యూనిట్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లపై రుణాన్ని మంజూరు చేయకూడదు.

  • బంగారం యాజమాన్యం అనుమానాస్పదంగా ఉన్నప్పుడు దానిపై రుణాలు మంజూరు చేయకూడదు. బంగారం సదురు వ్యక్తిదేనా అని రుజువు చేసే డాక్యుమెంట్‌ గానీ, డిక్లరేషన్ గానీ రుణగ్రహీత నుంచి తీసుకోవాలి.

  • ఇప్పటికే తాకట్టు పెట్టిన బంగారం లేదా వెండిపై మళ్లీ రుణాలు మంజూరు చేయకూడదు.

  • వాల్యుయేషన్ విషయానికి వస్తే, పూచీకత్తుగా స్వీకరించిన బంగారం లేదా వెండిని దాని వాస్తవ స్వచ్ఛతకు (క్యారెట్లు) సంబంధించిన రిఫరెన్స్ ధర ఆధారంగా అంచనా వేయాలి. ఇందుకోసం బంగారం లేదా వెండి తాకట్టుకు వచ్చిన మునుపటి 30 రోజుల సగటు ముగింపు ధర లేదా క్రితం రోజు ముగింపు ధరను పరిగణనలోకి తీసుకోవచ్చు.

  • ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ (ఐబీజేఏ) లేదా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నియంత్రించే కమోడిటీ ఎక్స్ఛేంజ్ ప్రచురించిన విధంగా దీనిని ఉపయోగించాలి.

  • ఇక బంగారంపై ఎంత అప్పు ఇవ్వచ్చన్న దానికి సంబంధించి గరిష్ట లోన్-టు-వాల్యూ (ఎల్టీవీ) నిష్పత్తుల విషయానికి వస్తే..  రూ.2.5 లక్షలు, అంత కంటే తక్కువ రుణం తీసుకునేవారికి తాకట్టు పెట్టే బంగారం విలువలో 85 శాతం లోన్‌గా ఇస్తారు. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 80 శాతం, రూ.5 లక్షలు దాటితే 75 శాతం రుణంగా ఇస్తారు.

  • తాకట్టుగా తీసుకునే బంగారం ఆభరణాల రూపంలో అయితే 1 కేజీ, కాయిన్ల రూపంలో అయితే 50 గ్రాములు మించకూడదు.

  • ఒకవేళ రుణం తిరిగి చెల్లించని పక్షంలో సెక్యూరిటీగా తీసుకున్న బంగారం, వెండి వస్తువులు వేలం వేసే ప్రక్రియ గురించి రుణ గ్రహీతకు ముందే తెలియజేయాలి.

  • రుణం తిరిగి చెల్లించిన వెంటనే తాకట్టులో ఉన్న బంగారం, వెండి వస్తువులను రుణగ్రహీతకు అప్పగించాలి. 7 పని దినాల్లో వస్తువులు విడుదల చేయకపోతే రోజుకు రూ.5000 చొప్పున పెనాల్టీని రుణగ్రహీతకు చెల్లించాలి.

Advertisement
 
Advertisement
Advertisement