నాలుగు నగరాల్లో రిటైల్‌ డిజిటల్‌ రూపీ | Sakshi
Sakshi News home page

నాలుగు నగరాల్లో రిటైల్‌ డిజిటల్‌ రూపీ

Published Fri, Dec 2 2022 6:20 AM

RBI to launch retail digital rupee pilot on 1 December 2022 - Sakshi

న్యూఢిల్లీ: రిటైల్‌ డిజిటల్‌ రూపాయిని ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ గురువారం నాలుగు నగరాల్లో తొలి పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభించింది. ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్‌ ఈ నగరాల్లో ఉన్నాయి. పరిమిత సంఖ్యలో యూజర్లతో ఆర్‌బీఐ ఈ ప్రాజెక్టును పరీక్షిస్తోంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, యస్‌ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ ఇందులో పాలుపంచుకుంటున్నాయి. రెండో విడతలో దీన్ని హైదరాబాద్‌ సహా తొమ్మిది నగరాలకు విస్తరించనుండగా, మరో నాలుగు బ్యాంకులు కూడా పాల్గోనున్నాయి.

ఆర్‌బీఐ ఇప్పటికే టోకు లావాదేవీల కోసం నవంబర్‌ 1న డిజిటల్‌ రూపాయిని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. భౌతిక రూపంలో నగదు నిర్వహణ వ్యయాలను తగ్గించేందుకు, అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చేందుకు ఇది ఉపయోగపడగలదని విశ్లేషకులు తెలిపారు. బ్యాంకులు అందించే మొబైల్‌ యాప్‌ వాలెట్‌ ద్వారా కస్టమర్లు ఈ–రూపీతో లావాదేవీలు నిర్వహించవచ్చని వివరించారు. కస్టమర్ల అభ్యర్ధన మేరకు వారి వాలెట్లలోకి బ్యాంకులు ఈ–రూపీని క్రెడిట్‌ చేస్తాయని, వ్యక్తులు .. వ్యాపార సంస్థలకు డిజిటల్‌ రూపంలో చెల్లింపులు జరిపేందుకు దీన్ని వినియోగించుకోవచ్చని  పేర్కొన్నారు. ప్రైవేట్‌ వర్చువల్‌ కరెన్సీలకు భిన్నంగా బ్యాంకుల అవసరాలను బట్టి ఆర్‌బీఐ అధికారికంగా ఈ కరెన్సీని జారీ చేస్తుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement