
రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) పరిధిలోకి రాష్ట్ర సహకార బ్యాంకులు, కేంద్ర సహకార బ్యాంకులు చేరనున్నాయి. ఇందుకు 2021 ఏకీకృత అంబుడ్స్‌మన్ పథకం(ఐవోఎస్)లోకి వీటిని చేరుస్తూ ఆర్‌బీఐ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో నవంబర్ 1నుంచి రూ.50 కోట్ల డిపాజిట్ పరిమాణంగల అన్ని వాణిజ్య బ్యాంకులతోపాటు.. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు, కేంద్ర సహకార బ్యాంకులు, షెడ్యూల్డ్ ప్రైమరీ(అర్బన్) సహకార బ్యాంకులు, నాన్‌షెడ్యూల్డ్ ప్రైమరీ(అర్బన్) సహకార బ్యాంకులకు ఏకీకృత అంబుడ్స్‌మన్ స్కీమ్ వర్తించనుంది.
కనీసం రూ. 100 కోట్లు అంతకుమించిన ఆస్తులు కలిగిన అన్ని నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)లనూ పథకం కవర్ చేయనుంది. అయితే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలను ఈ పథకం నుంచి మినహాయింపునివ్వగా.. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలను చేర్చింది. ఈ ఆర్‌బీఐ ఐవోఎస్‌ను 2021 నవంబర్‌లో ప్రవేశపెట్టింది. అంబుడ్స్‌మన్ అనేది బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఇతర నియంత్రిత సంస్థల వినియోగదారుల కోసం కేంద్రీకృత ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.
క్రెడిట్ రిస్క్‌లో సవరణ
బ్యాంకుల క్రెడిట్ రిస్క్ నిబంధనలను సవరించేందుకు ఆర్‌బీఐ తాజాగా ప్రతిపాదించింది. సంభవించిన నష్టాల ఆధారంగా ప్రొవిజనింగ్ చేపట్టేందుకు ప్రస్తుతం బ్యాంకులను ఆర్‌బీఐ నిబంధనలు అనుమతిస్తున్నాయి. వీటిస్థానే అంచనా రుణ నష్టాల ఆధారిత ప్రొవిజనింగ్‌కు వీలు కల్పించే విధంగా ఆర్‌బీఐ నిబంధనల సవరణకు ప్రతిపాదించింది. తద్వారా క్రెడిట్ రిస్క్ నిర్వహణా విధానాలను మరింత పటిష్టం చేయనుంది. అంతేకాకుండా వివిధ ఫైనాన్షియల్ సంస్థలను పోల్చి చూడటంలో మరిన్ని అవకాశాలకు తెరతీయనుంది.
2025 ఆర్‌బీఐ మార్గదర్శకాలు పేరుతో అంతర్జాతీయంగా అనుమతించిన నిబంధనలు, అకౌంటింగ్ ప్రమాణాలకు అనుగుణంగా తాజా ముసాయిదాను రూపొందించింది. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, దేశవ్యాప్త ఫైనాన్షియల్ సంస్థలు– అసెట్ క్లాసిఫికేషన్, ప్రొవిజనింగ్ అండ్ ఇన్‌కమ్ రికగ్నిషన్ పేరుతో ముసాయిదాను విడుదల చేసింది.
ఇదీ చదవండి: కేంద్రం చెంతకు పంచాయితీ!