Rakesh Jhunjhunwala Shares: నిఫ్టీ డౌన్‌, 25లక్షల షేర్లను అమ్మేసిన రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా!

Rakesh Jhunjhunwala Sells 25 Lakh Shares - Sakshi

ముంబై: ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో స్టాక్‌ సూచీలు రెండోరోజూ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్‌ 185 పాయింట్లు పతనమై 55,381 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 62 పాయింట్లు క్షీణించి 16,523 వద్ద నిలిచింది. జీడీపీతో సహా కీలక స్థూల ఆర్థిక గణాంకాలు మెప్పించకపోవడం,  క్రూడాయిల్‌ ధరల పెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలు కొనసాగడం, ప్రపంచ మార్కెట్లలో ప్రతికూలతలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.

 స్టాక్‌ సూచీలు జూన్‌ తొలి ట్రేడింగ్‌ సెషన్‌ను స్వల్ప నష్టాలతో ప్రారంభించాయి. ఇంట్రాడేలో 700 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్‌ 55,091 వద్ద కనిష్టాన్ని, 55,791 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 210 పాయింట్ల శ్రేణిలో 16,439 – 16,649 పరిధిలో ట్రేడైంది. చివరి గంటలో బ్యాంకింగ్, ఆర్థిక షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు నష్టాలు కొంతమేర తగ్గాయి. చిన్న తరహా షేర్లలో ఎక్కువగా విక్రయాలు తలెత్తడంతో బీఎస్‌ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ ఆరశాతానికి పైగా నష్టపోయింది. 

విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,930 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.984 కోట్ల షేర్లు కొన్నారు. ద్రవ్యోల్బణ భయాలు, వడ్డీరేట్ల పెంపు ఆందోళనలు వీడకపోవడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్‌ అవుతున్నాయి. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి జీవితకాల కనిష్టస్థాయి నుంచి 20 పైసలు రికవరీ అయ్యి 77.51 స్థాయి వద్ద స్థిరపడింది. 

లిస్టింగ్‌ లాభాలన్నీ మాయం 
లిస్టింగ్‌ లాభాల్ని నిలుపుకోవడంలో ఈ–ముద్ర షేరు విఫలమైంది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర(రూ.256)తో పోలిస్తే ఆరుశాతం ప్రీమియంతో రూ.271 వద్ద లిస్టయ్యింది. ఒక దశలో 9% ఎగిసి రూ.279 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అయితే మిడ్‌ సెషన్‌ నుంచి లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో లిస్టింగ్‌ లాభాలన్నీ మాయమయ్యాయి. చివరికి ఒకశాతం స్వల్ప లాభంతో రూ.259 వద్ద స్థిరపడింది. మొత్తం 5.54 లక్షల షేర్లు చేతులు మారాయి. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.2,020 కోట్లుగా నమోదైంది.   

మార్కెట్లో మరిన్ని సంగతులు 

ఏస్‌ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా తన మొత్తం వాటా(7.1%)లో ఒకశాతం వాటా(25 లక్షల షేర్లు)ను విక్రయించడంతో డెల్టా కార్పొరేషన్‌ షేరు మూడు శాతం నష్టపోయి రూ.212 వద్ద స్థిరపడింది. ఒక దశలో 7% క్షీణించి రూ.202 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. 

బెంచ్‌మార్క్‌ లెండింగ్‌ రేట్లను ఐదు బేసిస్‌ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించడంతో హెచ్‌డీఎఫ్‌సీ షేరు ఒకశాతం లాభపడి రూ.2,329 వద్ద నిలిచింది.  
 
గోవా ఫెర్టిలైజర్‌ ఫ్యాక్టరీని విక్రయించడంతో జువారీ ఆగ్రో షేరు ఏడుశాతం బలపడి రూ.148.25 వద్ద ముగిసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top