
స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 7 శాతం పుంజుకుని రూ. 2,650 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 2,488 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 13 శాతం క్షీణించి రూ. 4,397 కోట్లకు పరిమితమైంది.
అంతక్రితం క్యూ4లో రూ. 5,080 కోట్ల టర్నోవర్ అందుకుంది. వాటాదారులకు షేరుకి రూ. 35 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. దీనిలో రూ. 11.46 ప్రత్యేక డివిడెండ్ కలసి ఉంది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఎన్‌ఎస్‌ఈ నికర లాభం 47 శాతం జంప్‌చేసి రూ. 12,188 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 17 శాతం ఎగసి రూ. 19,177 కోట్లకు బలపడింది. ఈ కాలంలో మొత్తం రూ. 59,798 కోట్లమేర సెక్యూరిటీ లావాదేవీల పన్ను(ఎస్‌టీటీ) చెల్లించింది.
బీఎస్‌ఈ లాభం హైజంప్
మరో స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం బీఎస్‌ఈ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం హైజంప్ చేసి రూ. 494 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 107 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 543 కోట్ల నుంచి రూ. 926 కోట్లకు ఎగసింది. వాటాదారులకు షేరుకి రూ. 23 డివిడెండ్ ప్రకటించింది. దీనిలో రూ. 5 ప్రత్యేక డివిడెండ్ కలసి ఉంది.
కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి బీఎస్‌ఈ నికర లాభం 3 రెట్లు దూసుకెళ్లి రూ. 1,322 కోట్లను తాకింది. 2023–24లో కేవలం రూ. 404 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,596 కోట్ల నుంచి రూ. 3,236 కోట్లకు బలపడింది. ఈ కాలంలో ఈక్విటీ డెరివేటివ్స్‌లో 30.5 బిలియన్ కాంట్రాక్టులు ట్రేడ్‌కాగా.. రూ. 1,415 కోట్ల ఆదాయం నమోదైనట్లు బీఎస్‌ఈ వెల్లడించింది.