విపరీతంగా వాహన విక్రయాలు.. ఇంతలా కొనేశారేంటి?

PV sales up by 14pc in January 2024 - Sakshi

న్యూఢిల్లీ: యుటిలిటీ వాహనాలకు డిమాండ్‌ పెరుగుతుండటంతో జనవరిలో ప్యాసింజర్‌ వాహన (పీవీ) విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. హోల్‌సేల్‌ స్థాయిలో గత ఏడాది జనవరితో పోలిస్తే 14 శాతం పెరిగి 3,93,074 యూనిట్లు అమ్ముడయ్యాయి. జనవరి నెలలో పీవీల విక్రయాలకు సంబంధించి ఇవి అత్యుత్తమ గణాంకాలు. 

భారతీయ ఆటోమొబైల్‌ తయారీ సంస్థల సమాఖ్య సియామ్‌ విడుదల చేసిన డేటాలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం టూ–వీలర్ల హోల్‌సేల్‌ విక్రయాలు 26 శాతం పెరిగి 14,95,183 యూనిట్లకు చేరాయి. గతేడాది జనవరిలో వీటి సంఖ్య 11,84,376 యూనిట్లుగా ఉంది. వినియోగదారుల సెంటిమెంట్లు సానుకూలంగా ఉండటంతో ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయని, గ్రామీణ ప్రాంతాలు కోలుకుంటూ ఉండటంతో టూ–వీలర్ల విభాగం కూడా జనవరిలో వృద్ధి నమోదు చేసిందని సియామ్‌ ప్రెసిడెంట్‌ వినోద్‌ అగర్వాల్‌ తెలిపారు.

వాణిజ్య వాహనాల విభాగం పనితీరు అంత మెరుగ్గా లేనప్పటికీ వచ్చే రెండు నెలల్లో అమ్మకాలు పుంజుకోగలవని ఆయన పేర్కొన్నారు. త్రిచక్ర వాహనాల టోకు విక్రయాలు 9 శాతం వృద్ధి చెందాయి. 48,903 యూనిట్ల నుంచి 53,537 యూనిట్లకు చేరాయి. ఎలక్ట్రిక్‌ వాహనాల వ్యవస్థను పటిష్టం చేయడంపై, ముఖ్యంగా చార్జింగ్‌ మౌలిక సదుపాయాలు..ప్రజా రవాణాపై ప్రభుత్వం 2024 బడ్జెట్‌లో ప్రధానంగా దృష్టి పెట్టడమనేది ఆటో రంగం వృద్ధి గతి కొనసాగేందుకు దోహదపడగలదని అగర్వాల్‌ పేర్కొన్నారు.  

జనవరిలో అమ్మకాలు ఇలా.. 

  • మార్కెట్‌ లీడరు మారుతీ సుజుకీ హోల్‌సేల్‌ అమ్మకాలు 1,47,348 యూనిట్ల నుంచి 1,66,802 యూనిట్లకు చేరాయి. పోటీ సంస్థ హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా విక్రయాలు 50,106 యూనిట్ల నుంచి 57,115కి పెరిగాయి. అటు మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) హోల్‌సేల్‌ అమ్మకాలు 33,040 వాహనాల నుంచి 43,068కి చేరాయి. 
  • మోటర్‌సైకిల్‌ విభాగంలో హీరో మోటోకార్ప్‌ గతేడాది జనవరిలో 3,26,467 వాహనాలను విక్రయించగా ఈసారి 3,83,752 యూనిట్లు విక్రయించింది. అటు హోండా మోటర్‌సైకిల్‌ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 1,27,912 యూనిట్ల నుంచి 1,83,638 యూనిట్లకు పెరిగాయి. బజాజ్‌ ఆటో విక్రయాలు 1,38,860 యూనిట్ల నుంచి 1,78,056 యూనిట్లకు చేరాయి. 
  • టీవీఎస్‌ మోటర్‌ అమ్మకాలు 1,24,664 యూనిట్లుగా (గత జనవరిలో 1,00,354), సుజుకీ మోటర్‌సైకిల్‌ విక్రయాలు 78,477 యూనిట్లుగా (గత జనవరిలో 65,991) నమోదయ్యాయి. స్కూటర్లకు సంబంధించి హోండా మోటర్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా అమ్మకాలు 1,50,243 యూనిట్ల నుంచి 1,98,874 యూనిట్లకు చేరాయి.

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top