
చిన్న మొత్తాల పొదుపు పథకాల (ఎస్‌సీఎస్) ఖాతాలకు తపాలా శాఖ కొత్త నిబంధనలను జారీ చేసింది. వీటికి అనుగుణంగా లేని ఖాతాలను మూసివేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మెచ్యూరిటీ పీరియడ్ ముగిసిన తర్వాత మూడేళ్లు దాటినా కూడా క్లోజ్ చేయని ఖాతాలను అధికారులు ఇప్పుడు స్తంభింపజేయనున్నారు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్‌సీఎస్ఎస్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్‌సీ), కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ), పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (ఎంఐఎస్), పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (టీడీ), పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ) వంటి చిన్న పొదుపు పథకాల ఖాతాలకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి.
మూడేళ్ల మెచ్యూరిటీ తర్వాత కూడా క్లోజ్ చేయని స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాలను స్తంభింపజేస్తూ తపాలా శాఖ జూలై 15న ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్వెస్టర్ల సొమ్మును కాపాడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం, ఇన్ యాక్టివ్, మెచ్యూరిటీ తీరిపోయిన పొదుపు పథకాల అకౌంట్లను ఖాతాదారులు అధికారికంగా పొడిగించుకోకపోతే పోస్టాఫీస్ ఇప్పుడు సంవత్సరానికి రెండుసార్లు గుర్తించి స్తంభింపజేస్తుంది.
డిపాజిటర్లు కష్టపడి సంపాదించి పొదుపు చేసుకున్న డబ్బుకు భద్రతను మరింత పెంచడానికి ఈ ఫ్రీజింగ్ యాక్టివిటీని సంవత్సరానికి రెండుసార్లు నిరంతర చక్రంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు పోస్టల్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఏటా జనవరి 1, అలాగే జూలై 1న రెండు సార్లు ఈ ప్రక్రియ జరగనుంది. ఈ తేదీల నుంచి 15 రోజుల్లో ఇలాంటి ఖతాలను గుర్తించడం, స్తంభింపజేయడం పూర్తవుతుంది. ఏటా జూన్ 30, డిసెంబర్ 31 నాటికి మూడేళ్ల మెచ్యూరిటీ పూర్తి చేసుకున్న ఖాతాలను గుర్తించి స్తంభింపజేస్తామని తపాలా శాఖ తెలిపింది.
మెచ్యూరిటీ తీరిన తమ పొదుపు పథకాల ఖాతాలు స్తంభింపజేయకుండా ఉండటానికి, ఖాతాదారులు డిపాజిట్ పథకాన్ని అధికారికంగా పొడిగించడానికి అభ్యర్థనలను సమర్పించాల్సి ఉంటుంది. ఒక వేళ పొడిగింపు వద్దనుకుంటే ఖాతా మూసివేతకు దరఖాస్తు చేయాలి. కాగా 2025-26 ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి అన్ని చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన కొద్ది రోజులకే ఈ నిబంధనలు వచ్చాయి.