ఫార్మా ఎగుమతులు 4 శాతం అప్‌

Pharma exports rise by 4. 22percent during April-Oct - Sakshi

ఫార్మెక్సిల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఉదయ భాస్కర్‌ వెల్లడి

హైదరాబాద్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (ఏప్రిల్‌–అక్టోబర్‌) ఫార్మా ఎగుమతులు 4.22 శాతం వృద్ధి చెంది 14.57 బిలియన్‌ డాలర్లకు చేరాయి. గత ఏడాది ఇదే వ్యవధిలో ఎగుమతులు 13.98 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఇవి 27 బిలియన్‌ డాలర్లకు చేరవచ్చని అంచనాలు నెలకొన్నాయి. కేంద్ర వాణిజ్య శాఖలో భాగమైన ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్‌) డైరెక్టర్‌ జనరల్‌ ఉదయ భాస్కర్‌ ఈ విషయాలు వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఫార్మా ఎగుమతులు 24.62 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

జూలై, అక్టోబర్‌ ఎగుమతులు కాస్త తగ్గినప్పటికీ సెప్టెంబర్‌లో సానుకూలంగానే ఉన్నాయని, ఇదే ధోరణి పూర్తి ఆర్థిక సంవత్సరంలోను కొనసాగవచ్చని భాస్కర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. అక్టోబర్లో ఫార్మా ఎగుమతులు 5.45 శాతం క్షీణించి 1.95 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాలతో పాటు కొన్ని కీలక కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ బలపడటం కూడా ఎగుమతుల తగ్గుదలకు కారణమైనట్లు భాస్కర్‌ చెప్పారు. ‘ఉదాహరణకు భారత ఫార్మాకు టాప్‌ 5 మార్కెట్లలో నైజీరియా కూడా ఒకటి. అమెరికా డాలర్‌తో పోలిస్తే నైజీరియా నైరా క్షీణత కొనసాగుతుండటంతో ఆ దేశం దిగుమతులను తగ్గించుకోవాల్సి వస్తోంది‘ అని ఆయన తెలిపారు. ప్రస్తుతం భారత్‌కు అమెరికా, కెనడా, మెక్సికోతో పాటు యూరప్, ఆఫ్రికా దేశాలు టాప్‌ మార్కెట్లుగా ఉంటున్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top