నోయిడాలో మూడు రోజుల పాటు నిర్వహణ
120 దేశాల నుంచి నిపుణులు, ఎగ్జిబిటర్లు, ఇన్వెస్టర్లు
న్యూఢిల్లీ: ఈ నెల 25 నుంచి గ్రేటర్ నోయిడాలో 18వ విడత అంతర్జాతీయ ఫార్మా సదస్సు సీపీహెచ్‌ఐ, పీఎంఈసీ ఇండియా 2025ని నిర్వహించనున్నారు. ఇన్ఫార్మా మార్కెట్స్ ఇన్ ఇండియా మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఎక్స్‌పోలో.. యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ) విషయంలో స్వయం సమృద్ధి సాధించడం, డిజిటలైజేషన్, ఎగుమతులు మొదలైనవి ఇందులో ప్రధాన థీమ్‌లుగా ఉంటాయి. ఇటలీ, జర్మనీ, స్విట్జర్లాండ్, చైనా, దక్షిణ కొరియా తదితర 120 దేశాల నుంచి 50,000కు పైగా పరిశ్రమ నిపుణులు, 2,000 ఎగ్జిబిటర్లు, ఇన్వెస్టర్లు ఇందులో పాల్గోనున్నారు.
దేశీ దిగ్గజాలు డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, హెటిరో ల్యాబ్స్, అకుమ్స్ డ్రగ్స్, ఎంఎస్‌ఎన్ ల్యాబొరేటరీస్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. అంతర్జాతీయ ఫార్మాకు భారత్ కేంద్రంగా ఎదుగుతోందని ఇన్ఫార్మా మార్కెట్స్ ఇన్ ఇండియా ఎండీ యోగేష్ ముద్రాస్ తెలిపారు. దేశీ ఫార్మా పరిశ్రమ 2030 నాటికి 130 బిలియన్ డాలర్లకు, 2047 నాటికి 450 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతుందనే అంచనాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం కూడా ఫార్మాపై మరింతగా దృష్టి పెడుతోందని చెప్పారు.


