
ముంబై: అంతర్జాతీయంగా ఫార్మా ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకెళ్లే విషయంలో నియంత్రలే పెద్ద అడ్డంకిగా ఉన్నాయని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ పరిధిలోని ఫార్మాస్యూటికల్ విభాగం కార్యదర్శి ఎస్ అపర్ణ పేర్కొన్నారు. దీంతో దేశీ ఫార్మా సంస్థలు నాణ్యతపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎనిమిదో అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ నాణ్యతా సదస్సును ఉద్దేశించి వీడియో సందేశం ఇచ్చారు. ‘‘అంతర్జాతీయంగా ఫార్మా పరిశ్రమ అధిక నియంత్రణల మధ్య ఉంది.
మార్కెట్ ప్రవేశానికి నియంత్రణలే పెద్ద అడ్డంకి. భారత తయారీ రంగంలో ఎన్నో సంస్థలు ఉన్నాయి. అవన్నీ కూడా అన్ని రకాల శ్రేణుల్లో నాణ్యతపై దృష్టి పెట్టాలి. ఈ రంగంలో భారత్‌లో ఎన్నో చిన్న, మధ్యస్థాయి సంస్థలు ఉన్నాయి. ప్రధానంగా జనరిక్ మార్కెట్ మనది. మారుతున్న వ్యాధులకు అనుగుణంగా ఆవిష్కరణలపైనా దృష్టిపెట్టాలి’’అని అపర్ణ సూచించారు. భారత ఫార్మా సంస్థలకు గణనీయమైన సామర్థ్యం, నాణ్యత, వ్యయపరమైన అనుకూలతలు ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ మార్కెట్ వాటాను సొంతం చేసుకుంటున్నాయన్నారు.