
ఔషధ దిగుమతులపై 100 శాతం సుంకం మోత
కిచెన్ క్యాబినెట్లు, బాత్రూమ్ వ్యానిటీలపై 50 శాతం, ఫర్నిచర్‌పై 30 శాతం సుంకం
భారీ ట్రక్కుల దిగుమతిపైనా 25 శాతం వడ్డన
అక్టోబర్ 1 నుంచే అమల్లోకి వస్తాయని ట్రూత్ సోషల్‌లో ప్రకటన
మన కంపెనీలపై ప్రభావం ఉండదంటున్న కంపెనీలు
బ్రాండెడ్, పేటెంట్ ఔషధాలకే సుంకం వర్తిస్తుందని వెల్లడి
అమెరికా ప్రజలకు వైద్యం, ఔషధాలు మరింత భారం: నిపుణులు
ద్రవ్యోల్బణం ఎగబాకే అవకాశం: ఆర్థికవేత్తలు
వాషింగ్టన్: టారిఫ్‌ల మోతతో ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరో బాంబు పేల్చారు. ఈసారి ఫార్మా రంగంపై సుంకాలతో విరుచుకుపడ్డారు. విదేశాల నుంచి దిగుమతయ్యే ఫార్మా (బ్రాండెడ్, పేటెంటెడ్) ఉత్పత్తులపై ఏకంగా 100% సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా, కిచెన్ క్యాబినెట్లు, బాత్రూమ్ వ్యానిటీలపై 50%, సోఫాలు ఇతరత్రా ఫర్నిచర్‌పై 30% చొప్పున, భారీ ట్రక్కులపై 25 శాతం దిగుమతి సుంకాలను వడ్డించారు.
తాజా సుంకాలన్నీ అక్టోబర్ 1 నుంచే అమల్లోకి వస్తా యని గురువారం తన సోషల్ మీడియా సైట్ ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేశారు. అయితే, జనరిక్ ఔషధాలకు సుంకాలు వర్తించవని, దీని వల్ల ఫార్మా టారిఫ్‌ల ప్రభావం భారత్‌పై పెద్దగా ఉండదని మన కంపెనీలు చెబుతున్నాయి. మరోపక్క, ధరలు పెరిగిపోవడంతో అమెరికా ప్రజలకు వైద్యం, ఔషధాలు మరింత భారమవుతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా, కిచెన్ క్యాబినెట్లు, ఫర్నిచర్‌పై సుంకాల దెబ్బకు ఇళ్ల ధరలు ఎగబాకడంతో పాటు అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగేందుకు దారితీస్తుందనేది ఆర్థిక నిపుణుల మాట!
జాతీయ భద్రత సాకు...
ఔషధాలు, కిచెన్ క్యాబినెట్లు, సోఫాలు ఇతరత్రా ఫర్నీచర్, భారీ ట్రక్కులపై దిగుమతి సుంకాల విధింపునకు జాతీయ భద్రత, ఇతరత్రా కారణాలను ట్రంప్ సాకుగా చూపడం విశేషం. అయితే, అమెరికాలో కార్యకలాపాలు మొదలుపెట్టిన, ఇప్పటికే ప్లాంట్లను నిర్మిస్తున్న ఫార్మా కంపెనీలకు ఈ టారిఫ్‌లు వర్తించవని ట్రంప్ పేర్కొన్నారు. మరి అమెరికాలో ఇప్పటికే ఫ్యాక్టరీలు ఉన్న విదేశీ ఫార్మా సంస్థలకు టారిఫ్‌లు వర్తిస్తాయా లేదా అనేది దానిపై స్పష్టత లేదు. 2024లో అమెరికా దాదాపు 233 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా, వైద్య ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నట్లు అంచనా. ట్రంప్ టారిఫ్ దెబ్బతో కొన్ని మందుల ధరలు రెట్టింపు కావడంతో పాటు వైద్య ఖర్చులు కూడా భారీగా పెరిగి పోయే అవకాశం ఉంది.
‘టారిఫ్‌లు అమెరికన్లకు పెను భారంగా మారతాయి. ఔషధాల ధరలు తక్షణం పెరిగిపోవడం, ఇన్సూరెన్స్ ఖర్చులు ఎగబాకడం, ఆసుపత్రుల్లో మందులకు కొరతతో ప్రజలు అల్లాడటం ఖాయం’ అని కెనడియన్ చాంబర్ ఆప్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ పాస్కల్ చాన్ హెచ్చరించారు. మరోపక్క, విదేశాల్లో తయారైన భారీ ట్రక్కులు, విడిభాగాలను దిగుమతి చేసుకోవడం వల్ల దేశీ తయారీ సంస్థలను దెబ్బతీస్తోందని ట్రంప్ స్పష్టం చేశారు. సుంకాల పెంపు భారాన్ని వినియోగదారులపై వేయడం వల్ల ధరలు భారీగా ఎగబాకుతాయన్న ఆందోళనలను ట్రంప్ కొట్టిపారేశారు.
ఇదిలా ఉంటే, కిచెన్ క్యాబినెట్లు, ఫర్నీచర్‌పై సుంకాలతో ఇళ్ల ధరలకు రెక్కలు రావడం ఖాయమని రియల్టీ సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పటికే సరఫరా సమస్యలు, అధిక వడ్డీ రేట్లతో ప్రజలకు ఇళ్ల కొనుగోలు భారమవుతున్న తరుణంలో ట్రంప్ టారిఫ్‌లు మరింత గుదిబండగా మారతాయని అమెరికా జాతీయ రియల్టర్ల అసోసియేషన్ పేర్కొంది. ఏప్రిల్‌లో వివిధ దేశాలపై సుంకాల మోతకు తెరతీసినప్పుడు అమెరికాలో ద్రవ్యోల్బణం 2.3 శాతంగా ఉండగా, తాజాగా 2.9 శాతానికి ఎగబాకడం గమనార్హం.
బడా ఫార్మా దిగ్గజాల అమెరికా బాట...
కొన్ని నెలలుగా ట్రంప్ టారిఫ్ బెదిరింపుల నేపథ్యంలో మెర్క్, ఎలీలిలీ, జాన్సన్ అండ్ జాన్సన్, ఆస్ట్రాజెనికా, రోషె తదితర అంతర్జాతీయ ఫార్మా దిగ్గజాలు ఇప్పటికే అమెకాలో విస్తరణ ప్రణాళికలను ప్రకటించాయి. భారీగా పెట్టుబడులను కుమ్మరిస్తామంటూ ట్రంప్‌కు హామీ ఇచ్చాయి. బడా కంపెనీలు తయారీ ప్లాంట్లను అమెరికాకు తరలిస్తుండటం, ప్లాంట్ల నిర్మాణ పనులకు తెరతీయడంతో వాటిపై పెద్దగా ప్రభావం ఉండదని జెఫరీస్ ఎనలిస్ట్ ఆకాశ్ తివారీ అభిప్రాయపడ్డారు. చిన్న కంపెనీలకు మాత్రం టారిఫ్‌ల దెబ్బ తప్పదని పేర్కొన్నారు.