
ఫార్మెగ్జిల్ ఆందోళన
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సర్టీఫికెట్ ఆఫ్ ఫార్మా ప్రోడక్ట్ (సీవోపీపీ) దరఖాస్తులను ఓఎన్‌డీఎల్‌ఎస్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లోనే సమరి్పంచాలంటూ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ జారీ చేసిన సర్క్యులర్, దేశీ ఔషధ సంస్థలను కలవరపరుస్తోంది. దీని వల్ల ఎగుమతులకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఫార్మాస్యూటికల్స్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెగ్జిల్) ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ సర్క్యులర్‌ను తక్షణం పునఃసమీక్షించాలని కోరింది. రెగ్యులేటరీ వ్యవస్థలను డిజిటలీకరించడాన్ని తాము స్వాగతిస్తామని, కానీ దానికి మారే విషయంలో ఎగుమతిదారులకు తగిన మార్గదర్శ ప్రణాళికను ఇవ్వకుండానే హఠాత్తుగా కొత్త నిబంధనలను పాటించి తీరాల్సిందేనంటూ ఆదేశించడం సరికాదని పేర్కొంది. దీని వల్ల రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ (ఆర్‌వోడబ్ల్యూ)కి ఫార్మా ఎగుమతులు గణనీయంగా అవరోధాలు ఏర్పడతాయని ఫార్మెగ్జిల్ వివరించింది. ప్రస్తుతం మొత్తం ఫార్మా ఎగుమతుల్లో ఆర్‌ఓడబ్ల్యూ మార్కెట్ల వాటా దాదాపు 45 శాతంగా ఉంది.
ఎగుమతిదారులు ఇప్పుడు నియంత్రణలపరంగా రెండు రకాల అవరోధాలను ఎదుర్కొనాల్సి వస్తుందని ఫార్మెగ్జిల్ డైరెక్టర్ జనరల్ కె. రాజా భాను తెలిపారు. దేశీయంగా సీడీఎస్‌సీవో నుంచి నో అబ్జక్షన్ సర్టీఫికెట్లు, కొత్త ఔషధాల వర్గీకరణపరమైన జాప్యాలు ఒక ఎత్తైతే అంతర్జాతీయంగా అనుమతుల్లో జాప్యం మరో ఎత్తుగా మారిందని వివరించారు. ఈ నేపథ్యంలోనే సీవోపీపీలను తప్పనిసరిగా ఓఎన్‌డీఎల్‌ఎస్ ద్వారానే సమర్పించాలన్న నిబంధనను వాయిదా వేయాలని, పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు జరపాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, సీడీఎస్‌సీవోలకు విజ్ఞప్తి చేసినట్లు వివరించారు.
సమతుల్యత ఉండాలి..
ఒకవైపు కఠినతరమైన నాణ్యతా ప్రమాణాలు, మరోవైపు వ్యాపారవర్గాలకు వెసులుబాట్ల మధ్య సమతుల్యత పాటించే విధంగా నియంత్రణ విధానాలు ఉండేలా చూడాలని కోరినట్లు రాజా భాను పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన తయారీని ప్రోత్సహించడమన్న ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ, నిబంధనలపరమైన కొన్ని కొత్త పరిణామాలు వ్యాపారాలకు ప్రతిబంధకాలుగా మారొచ్చని పరిశ్రమలో అభిప్రాయం నెలకొన్నట్లు వివరించారు. సీవోపీపీ అనుమతులను లేదా నో అబ్జక్షన్ సర్టీఫికెట్లను (ఎన్‌వోసీ) సకాలంలో పొందలేకపోతే, విదేశీ కొనుగోలుదారులు, మనతో పోటీ పడే దేశాలకు చెందిన ప్రత్యామ్నాయ సరఫరాదారులవైపు మళ్లే అవకాశం ఉందని ఆయన చెప్పారు. దీనితో దీర్ఘకాలికంగా భారతీయ ఎగుమతిదార్ల ప్రయోజనాలకు తీరని విఘాతం ఏర్పడుతుందని తెలిపారు.