
డబ్బుతో కొంత మంది వెర్రిపనులు చేస్తారు. కానీ ఎవరికీ వెర్రి ఉండదు. కొందరు అప్పు చేసి మరీ మనీని లగ్జరీ వస్తువులకు వాడుతుంటారు. ఖరీదైన వాహనాలు, బట్టలు, పర్యటనలు.. ఇలా అన్నింటిని అప్పుతో కానిచ్చేస్తుంటారు. ఇంకొందరు ఎంత మిగులు డబ్బున్నా ఆర్భాటాలకు పోకుండా పొదుపుపైనే దృష్టి సారిస్తూ అత్యవసరం అయితే తప్పా డబ్బును ఖర్చు చేయకుండా జాగ్రత్త పడుతారు. తర్వాతి తరాలకు సంపదను పోగు చేసి ఇస్తారు. పొదుపు, ఖర్చులకు సంబంధించి మనుషుల్లో విభిన్న మనస్తత్వాలుంటాయి. అందుకు చాలా కారణాలున్నాయి.
వివిధ తరాల మనుషులు వేర్వేరు ఆదాయాలు, విభిన్న విలువలు, వేరైన పరిస్థితుల్లో పెరిగిన వారు ఉంటారు. వాళ్ళందరూ ప్రపంచంలో విభిన్న ప్రదేశాలకు చెందినవారు. వేర్వేరు ఆర్థిక పరిస్థితుల్లో జన్మించినవారు. వారి ఉద్యోగ, సామాజిక స్థితులు భిన్నంగా ఉండవచ్చు. దానితోపాటు వారికి కలిగే ప్రేరణలు, అవకాశాలు కూడా విభిన్నంగా ఉండవచ్చు. ఈ నేపథ్యంలో వారు నేర్చుకునే జీవిత, ఆర్థిక పాఠాల్లో చాలా తేడాలుంటాయి.
ప్రపంచంలో డబ్బుకు సంబంధించి ప్రతి ఒక్కరి అనుభవం విభిన్నంగా ఉంటుంది. సాధారణంగా ఎవరో చెబితే విన్నదానికంటే ప్రత్యక్ష అనుభవానికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. అందుకే డబ్బు విషయంలో ప్రత్యేకమైన అభిప్రాయాలకు కట్టుబడి ఉన్నాం. ఒకరి అభిప్రాయాలకు మరొకరి అభిప్రాయాలతో పొంతన ఉండకపోవచ్చు. ఎదుటివారి పనులు చాలా మందికి తలతిక్కగా కనిపించవచ్చు. అయితే డబ్బు విషయంలో అంతిమంగా వ్యక్తులు ఎంత పోగు చేస్తున్నారు.. ఎంత ఖర్చు చేస్తున్నారనే దానిపైన ప్రధానంగా దృష్టి సారించాలని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ఒకటో తేదీ వచ్చిందంటే వణుకు
స్వీయ అనుభవంతోనే అంతా నేర్చుకోవాలని చూస్తే జీవితకాలం సరిపోదని గుర్తుంచుకోవాలి. డబ్బుకు సంబంధించి ఎదుటి వ్యక్తుల అనుభవాలు, అందుకు మీ పొదుపు ఆలోచనలు జోడించి ముందుకు సాగాలని సూచిస్తున్నారు. డబ్బును గౌరవించి సమర్థంగా పొదుపు, ఖర్చు చేస్తేనే అది కాపాడుతోందని చెబుతున్నారు.