ఐదేళ్ల గరిష్టానికి పీనోట్‌ పెట్టుబడులు | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల గరిష్టానికి పీనోట్‌ పెట్టుబడులు

Published Thu, Aug 3 2023 3:37 AM

Participatory-note investments touch over 5-year high of Rs 1. 13 lakh crore at June-end - Sakshi

న్యూఢిల్లీ: పార్టిసిపేటరీ నోట్ల (పీనోట్లు) ద్వారా దేశీయ క్యాపిటల్‌ మార్కెట్లలో పెట్టుబడులు జూన్‌ చివరికి రూ.1,11,291 కోట్లకు చేరాయి. దేశ ఈక్విటీ, డెట్, హైబ్రిడ్‌ సెక్యూరిటీల్లో (క్యాపిటల్‌ మార్కెట్లు) కలిపి ఈ మేరకు పెట్టుబడులు ఉన్నాయి. ఐదున్నరేళ్లలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. మే చివరికి పీ నోట్ల పెట్టుబడుల విలువ రూ.1,04,585 కోట్లుగా ఉంది. స్థూల ఆర్థిక అంశాలు స్థిరంగా ఉండడం ఇందుకు మద్దతుగా నిలిచిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పీనోట్ల పెట్టుబడుల విలువ పెరగడం వరుసగా నాలుగో నెలలోనూ నమోదైనట్టు సెబీ గణాంకాలు స్పస్టం చేస్తున్నాయి. సెబీ వద్ద నమోదు చేసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే విదేశీ ఇన్వెస్టర్లకు పీనోట్లను జారీ చేస్తుంటారు. సెబీ వద్ద నమోదు చేసుకోకుండా పీ నోట్ల ద్వారా ఇన్వెస్ట్‌ చేసుకునే వెసులుబాటు ఉంది.పీ నోట్‌ జారీ చేసే ఎఫ్‌పీఐలు ఇందుకు సంబంధించి సెబీ నిబంధనలు, మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఏప్రి ల్‌ చివరికి పీ నోట్ల పెట్టుబడుల విలువ రూ. 95, 911 కోట్లుగా ఉంటే, మార్చి చివరికి రూ. 88,600 కోట్లు, ఫిబ్రవరి చివరికి రూ.88,398 కో ట్లు, జనవరి చివరికి రూ.91,469 కోట్ల చొప్పున ఉంది.  

బలమైన పనితీరు వల్లే..
సాధారణంగా ఎఫ్‌పీఐల పెట్టుబడుల ధోరణికి అనుగుణంగానే పీనోట్ల పెట్టుబడులు కూడా ఉంటుంటాయి. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశి్చతులు నెలకొన్న సమయంలో భారత్‌ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన పనితీరు చూపిస్తుండడం పీ నోట్‌ పెట్టుబడుల వృద్ధికి దోహదపడినట్టు మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జూన్‌ చివరికి ఉన్న రూ.1.11 లక్షల కోట్లలో ఈక్విటీల్లోనే రూ.1,00,701 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. డెట్‌లో రూ.12,382 కోట్లు, హైబ్రిడ్‌ సెక్యూరిటీల్లో పెట్టుబడులు రూ.203 కోట్లుగా ఉన్నాయి. జూన్‌ చివరికి ఎఫ్‌పీఐల నిర్వహణలోని పెట్టుబడులు రూ.55.63 లక్షల కోట్లకు చేరాయి. మరోవైపు భారత ఈక్విటీల్లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు పది నెలల గరిష్ట స్థాయి అయిన రూ.47,184 కోట్లకు జూన్‌ నెలలో చేరాయి. అదే నెలలో డెట్‌మార్కెట్లో ఎఫ్‌పీఐలు రూ.9,200 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. 

Advertisement
Advertisement