
గతేడాది దేశీయంగా 84,000 పైచిలుకు ఆన్‌లైన్ గేమింగ్ ఖాతాదారుల వివరాలు లీక్ అయినట్లు గ్లోబల్ సైబర్‌సెక్యూరిటీ, డిజిటల్ ప్రైవసీ కంపెనీ కాస్పర్‌స్కీ వెల్లడించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో (ఏపీఏసీ) ఇలాంటి ఉదంతాలు అత్యధికంగా థాయ్‌ల్యాండ్‌లో, అత్యల్పంగా సింగపూర్‌లో నమోదయ్యాయి.
కాస్పర్‌స్కీ ప్రకారం.. థాయ్‌ల్యాండ్‌లో 1,62,892 కేసులు, ఫిలిప్పీన్స్‌లో 99,273, వియత్నాంలో 87,969, సింగపూర్‌లో 4,262 కేసులు నమోదయ్యాయి. గతేడాది మొత్తం మీద 1.1 కోట్ల గేమింగ్ ఖాతాల వివరాలు బహిర్గతమైనట్లు కాస్పర్‌స్కీ తెలిపింది. అంతర్జాతీయంగా గేమర్లలో దాదాపు సగం మంది ఏపీఏసీ రీజియన్‌లోనే ఉన్నారు.
ఆగ్నేయాసియాలో చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా మార్కెట్లు కీలకంగా ఉంటున్నాయి. ఈ మార్కెట్లలో డిజిటల్.. మొబైల్స్ వినియోగం పెరగడం, పెద్ద సంఖ్యలో యువ జనాభా తదితర అంశాలు గేమింగ్‌కి దన్ను గా ఉంటున్నాయి. 180 కోట్ల మంది పైగా
ప్లే యర్లతో ఏపీఏసీ రీజియన్ అంతర్జాతీయంగా గేమింగ్ ధోరణులను కొత్తగా తీర్చిదిద్దుతోందని కాస్పర్‌స్కీ తెలిపింది. దీంతో ఈ ప్రాంతంలో సైబర్ ముప్పులు కూడా పెరుగుతున్నాయని వివరించింది.
ఇదీ చదవండి: ఉద్యోగం మానేసి నా స్టోర్‌లో పనిచెయ్ అన్నాడు: కానీ ఇప్పుడు..
ద్వితీయ శ్రేణి నగరాలపై కంపెనీ దృష్టి
భారత్‌లో విస్తరణలో భాగంగా ఇతర భాగస్వాములతో చేతులు కలపడం ద్వారా ద్వితీయ శ్రేణి పట్టణాల్లోకి కూడా ప్రవేశించే యోచనలో ఉన్నట్లు కాస్పర్‌స్కీ ఎండీ (ఆసియా పసిఫిక్) ఏడ్రియన్ హియా తెలిపారు. ప్రస్తుతం కంపెనీ దేశీయంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు నుంచి కార్యకలాపాలు సాగిస్తోంది. గత రెండేళ్లుగా భారత్‌లో సేల్స్, టెక్నికల్ సపోర్ట్ తదితర విభాగాల్లో స్థానిక సిబ్బంది సంఖ్యను మూడు రెట్లు పెంచుకున్నట్లు హియా చెప్పారు. అంతర్జాతీయంగా తమ కార్యకలాపాలకు కీలక ఇన్నోవేషన్ హబ్‌గా భారత్‌ను పరిగణిస్తున్నామని, ఇక్కడ పరిశోధన–అభివృద్ధి కార్యకలాపాలను పెంచుకుంటున్నామని వివరించారు.