ఆన్‌లైన్‌ గేమింగ్‌పై నిషేధాస్త్రం | Lok Sabha passes bill to ban online games played with money | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ గేమింగ్‌పై నిషేధాస్త్రం

Aug 21 2025 1:10 AM | Updated on Aug 21 2025 1:10 AM

Lok Sabha passes bill to ban online games played with money

‘ప్రమోషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లు–2025’కు లోక్‌సభ ఆమోదం  

ఆన్‌లైన్‌ మనీ గేమ్‌లు నిర్వహించినా, ప్రచారం చేసినా జైలుశిక్ష, భారీ జరిమానా  

నగదు బదిలీలకు వీలు కల్పించినా నేరమే  

ఇలాంటి గేమ్‌లతో యువత భవిష్యత్తు దెబ్బతింటోందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ 

ఆందోళన డబ్బు ప్రమేయం లేని ఈ–స్పోర్ట్స్, ఆన్‌లైన్‌ సోషల్‌ గేమింగ్‌కు ప్రోత్సాహం  

న్యూఢిల్లీ:  దేశంలో జనం జేబులను గుల్లచేస్తూ, వారి ప్రాణాలను బలి తీసుకున్న ఆన్‌లైన్‌ గేమ్‌లకు చెక్‌పెట్టే దిశగా అత్యంత కీలకమైన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. డబ్బుతో ముడిపడి ఉన్న ఆన్‌లైన్‌ గేమ్‌లను నిర్వహించినా లేక ప్రోత్సహించినా లేక ప్రచారం చేసినా జైలుశిక్ష లేదా భారీ జరిమానా.. కొన్నిసార్లు జైలుశిక్షతోపాటు జరిమానా కూడా విధించేలా ‘ప్రమోషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లు–2025’ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది.

ఆన్‌లైన్‌ మనీ గేమింగ్‌పై ఉక్కుపాదం మోపుతూ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ బుధవారం బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌)కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించడంతో, చర్చ లేకుండానే ఈ బిల్లు మూజువాణి ఓటుతో సభలో ఆమోదం పొందింది. బిల్లును ఇక రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ కూడా ఆమోదం పొందితే రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారుతుంది.  

ఎన్నో కుటుంబాలు నాశనం: స్పీకర్‌  
ఆన్‌లైన్‌ మనీ గేమింగ్‌ యువతకు వ్యసనంగా మారిందని, వారు ఆర్థికంగా నష్టపోతున్నారని, అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణన్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లుపై ఆయన లోక్‌సభలో కొద్దిసేపు మాట్లాడారు. డబ్బుతో ప్రమేయం లేని ఈ–స్పోర్ట్స్, ఆన్‌లైన్‌ సోషల్‌ గేమింగ్‌ను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోందని, ఇందుకోసం ఒక అథారిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఆన్‌లైన్‌ మనీ గేమింగ్‌ యాప్‌ల వల్ల యువత నష్టపోవడంతోపాటు మనీ లాండరింగ్, ఆర్థిక నేరాలు, మోసాలు సైతం జరుగుతున్నాయని గుర్తుచేశారు.

యాప్‌ల ద్వారా ఉగ్రవాద సంస్థలకు నిధులు అందుతాయని తెలిపారు. దీనిపై చర్చలో పాల్గొనాలని ప్రతిపక్ష సభ్యులను కోరగా, వారు వినిపించుకోలేదు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్పందిస్తూ... ప్రమాదకరమైన ఆన్‌లైన్‌ ఆటల వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయని, యువత భవిష్యత్తు దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆన్‌లైన్‌ గేమ్‌లపై ప్రభుత్వం నిషేధం విధించాలని గతంలో ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయని అన్నారు. ఎస్‌ఐఆర్‌ చర్చించాలని పట్టుబడుతూ విపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుండడంతో స్పీకర్‌ సభను గురువారానికి వాయిదా వేశారు.  

ఇండియాలో ఆన్‌లైన్‌ మనీ గేమ్‌ల వల్ల ప్రతిఏటా 45 కోట్ల మంది దాదాపు రూ.20,000 కోట్లు నష్టపోతున్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది.  

ఏమిటీ బిల్లు?   
అన్ని రకాల ఆన్‌లైన్‌ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌(సట్టా, పోకర్, రమ్మీ, కార్డ్‌ గేమ్స్‌)తోపాటు ఆన్‌లైన్‌ ఫ్యాంటసీ స్పోర్ట్స్, ఆన్‌లైన్‌ లాటరీలను నిషేధిస్తూ ఈ బిల్లును తీసుకొచ్చారు. డబ్బులు పెట్టి ఆన్‌లైన్‌లో ఆడే క్రీడలపై నిషేధం అమలవుతుంది.  

ఆన్‌లైన్‌ గేమ్‌లకు ప్రచారం చేసినవారు కూడా నేరçస్తులే. ఇలాంటి గేమ్‌ల్లో ఒకరి నుంచి మరొకరికి ఆన్‌లైన్‌లో నగదు బదిలీలకు వీలు కల్పించిన బ్యాంక్‌లు లేదా ఆర్థిక సంస్థలను సైతం శిక్షిస్తారు.  
ఆన్‌లైన్‌ గేమ్‌ను ఏ రూపంలో నిర్వహించినా, ప్రోత్సహించినా, ప్రచారం చేసినా నేరమే. అంటే కంప్యూటర్‌ లేదా మొబైల్‌ ఫోన్‌ ద్వారా చేసినా నేరంగా పరిగణిస్తారు. సోషల్‌ మీడియా లేదా పత్రికలు లేదా టీవీల్లో ప్రచారం చేసినా శిక్ష తప్పదు.  

నైపుణ్యం లేదా అదృష్టం(చాయిప్‌)పై ఆధారపడిన ఏ గేమ్‌ అయినా నిషిద్ధమే.  
మన దేశంలోనే కాకుండా.. దేశ సరిహద్దుల్లో లేదా విదేశీ గడ్డపై నుంచి గేమ్‌లను నిర్వహించినా దోషులే అవుతారు.  
ఈ బిల్లు ప్రకారం.. ఆన్‌లైన్‌ గేమ్‌ల్లో పాల్గొన్నవారిని దోషులుగా కాకుండా బాధితులుగానే పరిగణిస్తారు.  
డబ్బుతో సంబంధం లేదని ఈ–స్పోర్ట్స్, ఎడ్యుకేషనల్‌ గేమ్స్, సోషల్‌ గేమ్స్‌కు కొన్ని నియంత్రణలను బిల్లు సూచిస్తోంది.  

సమాజంలో అశాంతి తలెత్తకుండా చూడాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని బిల్లులో పొందుపర్చారు. డిజిటల్‌ టెక్నాలజీని బాధ్యతాయుతంగా వాడుకొనేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.  
డబ్బు ప్రమేయం లేని ఈ–స్పోర్ట్స్‌ చట్టబద్ధమే అవుతాయి. ఇందుకోసం కేంద్ర క్రీడల శాఖ కొన్ని మార్గదర్శకాలు, ప్రమాణాలు రూపొందించాలని బిల్లులో సూచించారు. విద్యా, సాంస్కృతిక విలువలను పెంపొందించడానికి, నైపుణ్యాభివృద్ధికి, సమాజంలో ప్రజల మధ్య అనుసంధానానికి ఆన్‌లైన్‌ సోషల్‌ గేమ్స్‌ను ప్రోత్సహించవచ్చు. ఈ మేరకు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవాలి.  

 ఈ–స్పోర్ట్స్‌కు సంబంధించి శిక్షణ, పరిశోధనలకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది.  
 మానసికోల్లాసం, నైపుణ్యాభివృద్ధి కోసం సోషల్, ఎడ్యుకేషన్‌ గేమ్స్‌ ఆడుకోవచ్చు.  
 ఆన్‌లైన్‌ గేమ్‌లను వర్గీకరించడానికి, రిజిస్టర్‌ చేసుకోవడానికి రూ.50 కోట్లతో జాతీయ స్థాయిలో గేమింగ్‌ అథారిటీ ఏర్పాటు చేస్తారు. దీనికి ప్రతిఏటా రూ.20 కోట్లు కేటాయిస్తారు. ఎలాంటి గేమ్‌ అనేది ఈ అథారిటీ నిర్ణయిస్తుంది. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తుంది.  

గేమింగ్‌ సంస్థల అభ్యంతరాలు  
ఆన్‌లైన్‌ మనీ గేమింగ్‌ను నిషేధించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని గేమింగ్‌ సంస్థలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ఇండియా గేమింగ్‌ ఫెడరేషన్, ఈ–గేమింగ్‌ ఫెడరేషన్, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫాంటసీ స్పోర్ట్స్‌ వంటి సంస్థలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు లేఖ రాశాయి. మన దేశంలో ఆన్‌లైన్‌ స్కిల్‌ గేమింగ్‌ పరిశ్రమ నానాటికీ వృద్ధి చెందుతోందని, దీని విలువ రూ.2 లక్షల కోట్లకు చేరిందని వెల్లడించాయి.

ఈ గేమ్‌లతో ప్రతిఏటా రూ.31,000 కోట్లకుపైగా ఆదాయం వస్తోందని తెలిపాయి. ప్రభుత్వానికి ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారా ఏటా రూ.20,000 కోట్లకుపైగా ఆదాయం లభిస్తోందని గుర్తుచేశాయి. ఈ పరిశ్రమ ప్రతి సంవత్సరం 20 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తోందని, 2028 నాటికి రెండురెట్లు అవుతుందని పేర్కొన్నాయి. అందుకే ఆన్‌లైన్‌ గేమ్‌లను నిషేధించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశాయి.  

శిక్షలేమిటి?  
 ఆన్‌లైన్‌ గేమ్‌లు నిర్వహిస్తే మూడేళ్ల వరకు జైలుశిక్ష పడుతుంది లేదా రూ.కోటి దాకా జరిమానా చెల్లించాల్సి రావొచ్చు. కొన్ని సార్లు ఈ రెండు శిక్షలూ అనుభవించాలి.  
ఆన్‌లైన్‌ మనీ గేమ్‌లకు ప్రచారం చేస్తే రెండేళ్ల దాకా జైలు శిక్ష లేదా రూ.50 లక్షల జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో ఈ రెండు శిక్షలూ విధించవచ్చు.  
నగదు బదిలీలకు సహకరిస్తే మూడేళ్ల దాకా జైలుశిక్ష లేదా రూ.కోటి జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో రెండు శిక్ష లూ విధించడానికి ఆస్కారం ఉంటుంది.  
ఆన్‌లైన్‌ గేమ్‌లు నిర్వహిస్తూ మళ్లీమళ్లీ దొరికిపోతే 3 నుంచి 5 సంవత్సరాల దాకా జైలుశిక్ష, రూ.2 కోట్ల దాకా జరిమానా తప్పదు.  

నిందితులపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు న మోదు చేస్తారు. వారెంట్‌ లేకుండానే నిందితులను అరెస్టు చేయొచ్చు, విచారించవచ్చు.   
ఆన్‌లైన్‌ గేమ్‌లకు ప్రచారం కల్పిస్తే సినిమా నటులైనా, క్రికెట్‌ ఆటగాళ్లయినా, ఇతర ప్రముఖులైనా శిక్ష నుంచి ఎలాంటి మినహాయింపులు ఉండవు.  
ఆన్‌లైన్‌ గేమ్‌లను నిషేధించడం వల్ల ప్రభు త్వం కొంత ఆదాయం కోల్పోయే పరిస్థితి ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమాన్ని, సమాజం బాగును దృష్టిలో పెట్టుకొని నిషేధం వైపే మొగ్గు చూపినట్లు సీనియర్‌ అధికారి చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement