
సాక్షి, సిటీబ్యూరో: అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతున్న మహిళలు.. స్థిరాస్తి రంగంలో మాత్రం కాస్త వెనకబడే ఉన్నారు. దేశీయ రియల్ ఎస్టేట్ పరిశ్రమలో మహిళా కార్మికులు పరిమితంగానే ఉన్నారు. ప్రస్తుతం రియల్టీలో 7.1 కోట్ల మంది కార్మికులు పని చేస్తుండగా.. మహిళా కార్మికుల సంఖ్య కేవలం 70 లక్షలే. మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు (ఎల్‌ఎఫ్‌పీఆర్) కేవలం 25.1 శాతంగా మాత్రమే ఉందని రియల్టీ సంస్థ మ్యాక్స్ ఎస్టేట్స్, గ్లోబల్ కన్సల్టింగ్ ఇన్ టెన్‌డమ్ అధ్యయనం వెల్లడించింది.
మహిళా జనాభాలో 1.2 శాతమే..
వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సృష్టించే రంగం రియల్ ఎస్టేటే. కానీ, స్థిరాస్తి రంగ శ్రామిక శక్తిలో మహిళ భాగస్వామ్యం అంతంత మాత్రంగానే ఉంది. దేశీయ స్థిరాస్తి రంగం క్రాస్ రోడ్స్‌లో ఉంది. అద్భుతమైన వృద్ధికి సిద్ధంగా ఉంది. అదే సమయంలో తారాస్థాయిలో వృద్ధి చెందకుండా నిరోధించేందుకూ సవాళ్లు ముందున్నాయి. దేశ జనాభాలో మహిళలు 48.5 శాతం మంది ఉన్నారు. ఇందులో దాదాపు 1.2 శాతం మంది మహిళలు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్నారు.
సవాళ్లు ఇవీ..
స్థిరాస్తి రంగంలోని శ్రామిక శక్తిలో అన్ని స్థాయిలలోనూ మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం, అసమాన వేతనం.. ఇవే ఈ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సవాళ్లు. లింగ సమానతలు పరిష్కరించడం వల్ల గణనీయమైన ఆర్థిక క ప్రయోజనాలు చేకూరతాయి. ఉత్పాదకత, ఆవిష్కరణలు, లాభదాయకత పెరుగుతాయి. అలాగే ఈ రంగంలో బ్లూ, వైట్ కాలర్ మహిళా కార్మికులను శక్తివంతం చేయడానికి నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాల అవసరం ఉంది. సరైన నాయకత్వం, సాంకేతికత వినియోగంతోనే దీన్ని సాధించగలమని నివేదిక సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment