
ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ తయారీదారు ఒమేగా సీకి మొబిలిటీ (OSM).. భారతదేశంలో తన మొట్టమొదటి అటానమస్ ఎలక్ట్రిక్ ఆటో-రిక్షాను లాంచ్ చేసింది. కంపెనీ దీనికి 'స్వయంగతి' అని పేరు పెట్టింది. ఇది ప్యాసింజర్ వెర్షన్, కార్గో వెర్షన్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధరలు వరుసగా రూ.4 లక్షలు, రూ. 4.15 లక్షలు (ఎక్స్ షోరూమ్).
ఒమేగా సీకి మొబిలిటీ.. ఈ సరికొత్త అటానమస్ ఎలక్ట్రిక్ ఆటో-రిక్షా కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు వెంటనే ప్రారంభమవుతాయి. ఇది 10.3 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 120 కిమీ రేంజ్ అందిస్తుంది. అయితే దీనికి కావలసిన ఛార్జింగ్ సదుపాయాల గురించి ఎలక్ట్రిక్ వాహన తయారీదారు ఇంకా ఎటువంటి సమాచారం అందించలేదు.
స్వయంగతి ఒమేగా సీకి.. ఏఐ స్వయంప్రతిపత్తి వ్యవస్థను పొందుతుంది. ఈ సెటప్‌లో లి-డార్ టెక్నాలజీ, జీపీఎస్, ఆరు మీటర్ల వరకు అడ్డంకి గుర్తింపు, మల్టీ సెన్సార్ నావిగేషన్, రిమోట్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ డ్రైవర్ అవసరం లేకుండానే.. ప్రీ-మ్యాప్ చేసిన మార్గాలను నావిగేట్ చేయడానికి వీలు కల్పిస్తాయి. కంపెనీ ఈ ఆటో రిక్షాను ఇప్పటికే టెస్ట్ చేసింది. రెండో దశలో కూడా టెస్ట్ చేయనున్నట్లు సమాచారం.
విమానాశ్రయాలు, టెక్ పార్కులు, గేటెడ్ కమ్యూనిటీలు, పారిశ్రామిక ప్రాంతాలు, స్మార్ట్ సిటీలలో ఈ ఎలక్ట్రిక్ రిక్షాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే కంపెనీ ఈ ఆటో రిక్షాను లాంచ్ చేసింది. ఒమేగా సీకి మొబిలిటీ రాబోయే రెండు సంవత్సరాలలో 1,500 అటానమస్ త్రీ-వీలర్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.