Ola Electric Vehicle: ఓలా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌, రూ. 37,500 కోట్లకు కంపెనీ విలువ

Ola Electric Vehicle Asset Value Rs 37 500 Crore - Sakshi

 ఓలా ఎలక్ట్రిక్‌ విలువ జూమ్‌

 రూ. 1,500 కోట్ల తాజా పెట్టుబడులు

ఓలా ఎలక్ట్రిక్‌ తాజాగా 20 కోట్ల డాలర్ల(రూ. 1,500 కోట్లు) పెట్టుబడులను సమకూర్చుకుంది. కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్‌ చేసిన సంస్థలతోపాటు యూఎస్‌కు చెందిన టెక్‌ ఫండ్స్‌ నిధులను అందించినట్లు తెలుస్తోంది.

దీంతో ప్రస్తుతం కంపెనీ విలువ 5 బిలియన్‌ డాలర్ల(రూ. 37,500 కోట్లు)ను తాకినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇంతక్రితం సెప్టెంబర్‌ 30న ఫాల్కన్‌ ఎడ్జ్, సాఫ్ట్‌బ్యాంక్‌ తదితరాల నుంచి 20 కోట్ల డాలర్లు సమకూర్చుకుంది. తద్వారా కంపెనీ విలువ 3 బిలియన్‌ డాలర్లకు చేరింది. దీంతో పోలిస్తే తాజా నిధుల సమీకరణతో కంపెనీ విలువ ఏకంగా 70 శాతం జంప్‌చేయడం గమనార్హం!

సెప్టెంబర్‌లో ఓలా.. ఎస్‌1 ఎలక్ట్రిక్‌ స్కూటర్ల విక్రయాలను ప్రారంభించింది. రెండు రోజుల్లోనే రూ. 1,100 కోట్ల విలువైన అమ్మకాల బుకింగ్స్‌ నమోదైనట్లు వెల్లడించింది. ఎస్‌1, ఎస్‌1 ప్రో బ్రాండ్లతో ఆగస్ట్‌లో రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లను ఓలా ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. నవంబర్‌లో తిరిగి అమ్మకాలకు తెరతీయనుంది. తమిళనాడులో స్కూటర్ల తయారీకి  500 ఎకరాలలో రూ. 2,400 కోట్లతో ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. తొలి దశ నిర్మాణ పనులు పూర్తయినట్లు కంపెనీ వెల్లడించింది. పూర్తిగా మహిళలతోనే నడిచే ఈ ప్లాంటులో మొత్తంగా 10,000 మందికి ఉపాధి కల్పించనున్నట్లు తెలియజేసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top