మిడ్‌క్యాప్స్‌లోనూ డెరివేటివ్స్‌

NSE gets SEBI nod to launch derivatives on Nifty Midcap Select Index - Sakshi

ఈ నెల 24 నుంచి షురూ

వీక్లీ, మంత్లీ సిరీస్‌ కాంట్రాక్టులు

వెల్లడించిన ఎన్‌ఎస్‌ఈ

న్యూఢిల్లీ: స్టాక్‌ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌లోనూ డెరివేటివ్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తాజాగా వెల్లడించింది. ఈ నెల 24 నుంచీ నిఫ్టీ మిడ్‌క్యాప్‌ సెలెక్ట్‌ ఇండెక్స్‌లో కాంట్రాక్టులను అనుమతించనున్నట్లు తెలియజేసింది. ఇందుకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతులు పొందినట్లు పేర్కొంది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 ఇండెక్స్‌ నుంచి ఎంపిక చేసిన 25 స్టాక్స్‌తోకూడిన పోర్ట్‌ఫోలియోను నిఫ్టీ మిడ్‌క్యాప్‌ సెలెక్ట్‌ ఇండెక్స్‌ ట్రాక్‌ చేస్తుందని వివరించింది.

ఈ ఇండెక్స్‌లో భాగమైన స్టాక్స్‌లోనూ విడిగా డెరివేటివ్స్‌ అందుబాటులో ఉంటాయని తెలియజేసింది. ఒక్కో స్టాక్‌కు ఫ్రీఫ్లోట్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పద్ధతిలో వెయిటేజీ ఉంటుందని వివరించింది. ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌లో భాగంగా నెలవారీ గడువు కాంట్రాక్టును మినహాయించి వారం రోజుల్లో గడువు ముగిసే(వీక్లీ) కాంట్రాక్టులతోపాటు, మరో మూడు నెలవారీ సీరియల్‌ కాంట్రాక్టులకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది.  

లార్జ్‌ క్యాప్స్‌లో..: ప్రస్తుతం ఇండెక్స్‌ డెరివేటివ్స్‌ ప్రధానంగా లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌ లేదా రంగాల ఆధారంగా ఎంపిక చేసిన కౌంటర్లలో అందుబాటులో ఉన్నట్లు ఎన్‌ఎస్‌ఈ సీఈవో, ఎండీ విక్రమ్‌ లిమాయే ఈ సందర్భంగా పేర్కొన్నారు. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో మిడ్‌క్యాప్స్‌ 17 శాతం వాటాను కలిగి ఉన్నట్లు తెలియజేశారు. పోర్ట్‌ఫోలియో రిస్కును తగ్గించుకునే బాటలో నిఫ్టీ మిడ్‌క్యాప్‌ సెలెక్ట్‌ ఇండెక్స్‌లో డెరివేటివ్స్‌ అదనపు హెడ్జింగ్‌ టూల్‌గా వినియోగపడతాయని వివరించారు. ఇటీవల మార్కెట్‌ ర్యాలీలో విభిన్నతరహా ఇన్వెస్టర్ల నుంచి మిడ్‌క్యాప్‌లో లావాదేవీలు పెరగడం, లిక్విడిటీ పుంజుకోవడం వంటి అంశాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈ నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడినట్లు నిపుణులు పేర్కొన్నారు. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ సెలెక్ట్‌ ఇండెక్స్‌ ఏడాదిలో 39% వృద్ధి చూపడం గమనార్హం! 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top