
జాతీయ రహదారులపై వెళ్లే వాహనదారులు తమ వాహనాలకు ఫాస్టాగ్ (FASTag) లేకపోతే డబుల్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. ఫంక్షనల్ ఫాస్టాగ్‌లు లేని వాహనాలు లావాదేవీలో నగదును ఉపయోగిస్తే రెట్టింపు రుసుము చెల్లించాలి. అదే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) ద్వారా చెల్లిస్తే వినియోగదారు రుసుముకు 1.25 రెట్లు మాత్రమే వసూలు చేస్తారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంతోపాటు జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద నగదు లావాదేవీలను తగ్గించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
సవరించిన జాతీయ రహదారుల రుసుము (రేట్లు, వసూళ్ల నిర్ణయం) నిబంధనలు, 2008 ప్రకారం.. చెల్లుబాటు అయ్యే, ఫంక్షనల్ ఫాస్టాగ్ లేకుండా ఫీజు ప్లాజాలోకి ప్రవేశించే వాహనాలు యూపీఐ (UPI) ద్వారా చెల్లింపును ఎంచుకుంటే ఆ వాహన కేటగిరికి వర్తించే వినియోగదారు రుసుము కంటే 1.25 రెట్లు మాత్రమే వసూలు చేస్తారని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది.
కొత్త ఫీజుల విధానం నవంబర్ 15 నుండి అమల్లోకి వస్తుంది. "ఈ సవరణ ఫీజు వసూలు ప్రక్రియను బలోపేతం చేయడం, టోల్ వసూలులో పారదర్శకతను పెంచడంతోపాటు జాతీయ రహదారి వినియోగదారులకు ప్రయాణ సౌలభ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది" అని రోడ్డు రవాణా శాఖ పేర్కొంది.