ఇంధన కొరతపై కేంద్ర మంత్రి క్లారిటీ! | No Fuel Shortage in India Situation Stable Union Minister Puri | Sakshi
Sakshi News home page

ఇంధన కొరతపై కేంద్ర మంత్రి క్లారిటీ!

Jun 14 2026 3:00 AM | Updated on Jun 14 2026 3:00 AM

No Fuel Shortage in India Situation Stable Union Minister Puri

దేశంలో ఎలాంటి ఇంధన కొరత లేదని, ముడిచమురు, ఎల్‌జీ, సహజ వాయువు సరఫరా పరిస్థితి చాలా ఆశాజనకంగా ఉందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి శనివారం స్పష్టం చేశారు. దేశీయంగా 60 రోజులకు పైగా సరిపడా ముడిచమురు, సహజ వాయువు నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. ఎల్‌పీజీ సరఫరా కూడా చాలా మెరుగ్గా ఉందన్నారు. గరిష్టంగా 75 నుంచి 80 రోజులకు సరిపోయేలా నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

ఎల్‌పీజీ కనెక్షన్‌ దారులు క్రమంగా పైప్‌డ్‌ గ్యాస్‌ (పీఎన్‌జీ) వైపు మారాలని ఆయన కోరారు. ఇక డీజిల్‌ విక్రయాలపై రోజుకు 200 లీటర్ల పరిమితి విధించడంపై స్పందిస్తూ.. బ్లాక్‌ మార్కెటింగ్‌ ను అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

అమెరికా దాడిపై భారత్‌ తీవ్ర ఆగ్రహం
ఒమన్‌ గల్ఫ్‌లో ఒక వాణిజ్య నౌకపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నౌకా సిబ్బంది మరణించిన ఘటనపై భారతదేశం తీవ్ర నిరసన వ్యక్తం చేసిందని మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి తెలిపారు. ఈ విషయమై భారత్‌లోని అమెరికా రాయబార ప్రతినిధిని రెండుసార్లు పిలిపించి మాట్లాడామని చెప్పారు. అలాగే కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ కూడా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో నేరుగా మాట్లాడి తమ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారని కేంద్ర మంత్రి వివరించారు.

పెరగనున్న ‘ఈ85’ ఇంధన పంపులు
పర్యావరణ అనుకూల ఇంధన రంగం గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌) పరిధిలో 47 ‘ఈ85’ (85 శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌) ఇంధన పంపులు ఉన్నాయని మంత్రి తెలిపారు. రాబోయే డిసెంబర్‌ 2026 నాటికి వీటి సంఖ్యను 500కు, డిసెంబర్‌ 2027 నాటికి ఏకంగా 5,000 పంపులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement