
7–8 ఏళ్లలో రెట్టింపు ఇన్వెస్టర్ల లక్ష్యం
సంస్థ ఈడీ, సీఈవో సందీప్ సిక్కా
కోల్‌కతా: నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ చిన్న పట్టణాల్లోకి సేవలను విస్తరించడం ద్వారా మరింత మంది రిటైల్ ఇన్వెస్టర్లకు చేరువ కావాలని చూస్తోంది. తద్వారా రానున్న 7–8 ఏళ్లలో తమ ఇన్వెస్టర్ల బేస్‌ను రెట్టింపు చేసుకోవాలన్న (5 కోట్లకు) లక్ష్యంతో ఉన్నట్టు నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో సందీప్ సిక్కా తెలిపారు.
ముఖ్యంగా తూర్పు భారత్‌లో మ్యూచువల్ ఫండ్స్ వృద్ధి జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందని, దాంతో ఈ ప్రాంతంపై ఎక్కువ బుల్లిష్ ధోరణితో (సానుకూలం) ఉన్నట్టు చెప్పారు. ‘‘తూర్పు భారత్‌లో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వ్యాప్తంగా 20 శాతం వృద్ధి ఉంటే నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ 27 శాతం వృద్ధిని నమోదు చేసింది.
2023–24లో ఈ ప్రాంతంలో మ్యూచువల్ ఫండ్స్ సిప్ పెట్టుబడులు 38 శాతం వృద్ధిని చూస్తే.. నిప్పన్ ఇండియా సిప్ పెట్టుబడులు 55 శాతం పెరిగాయి. అదే ఏడాది జాతీయ సిప్ సగటు వృద్ధి 34 శాతంగా ఉంది. రిటైల్ మార్కెట్లోకి మరింత లోతుగా చొచ్చుకుపోవడమే మా వ్యూహం. ముఖ్యంగా ఫండ్స్ సేవలు పెద్దగా విస్తరణకు నోచుకోని ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తాం. అక్కడే వృద్ధి అవకాశాలు ప్రధానంగా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో యూనిక్ ఇన్వెస్టర్ల బేస్ 6 కోట్లుగా ఉంటే.. ప్రస్తుతం మా ఇన్వెస్టర్ల సంఖ్య 2 కోట్ల మేర ఉంది’’అని సంస్థ ప్రణాళికలను సిక్కా వివరించారు.
అతిపెద్ద విదేశీ మ్యూచువల్ ఫండ్
నిప్పన్ ఇండియా భారత్‌లో అతిపెద్ద విదేశీ మ్యూచువల్ ఫండ్ సంస్థ అని (జపాన్‌కు చెందిన నిప్పన్ లైఫ్).. టాప్ 5 సంస్థల్లో బ్యాంకింగ్ స్పాన్సర్ లేకుండా ఎక్కువ వృద్ధిని తాము నమోదు చేసినట్టు సందీప్ సిక్కా తెలిపారు. 2023–24లో 27 శాతం అధికంగా 82 లక్షల ఇన్వెస్టర్లను సొంతం చేసుకున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా 269 శాఖలు ఉంటే.. తూర్పున 11 రాష్ట్రాల్లోని 50 ప్రాంతాల్లో శాఖలు కలిగి ఉన్నట్టు తెలిపారు. ఇన్వెస్టర్లలో పెరుగుతున్న అవగాహనతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో అసంఘటిత రంగం నుంచి పొదుపులు సంఘటిత రంగం వైపు మళ్లుతున్నట్టు వెల్లడించారు. తాము కొత్త పథకాల ఆవిష్కరణ కంటే ప్రస్తుత పథకాల రూపంలో మెరుగైన పెట్టుబడుల అవకాశాలను ఆఫర్ చేయడానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు.