
సెన్సెక్స్ 1200 పాయింట్లు ప్లస్
ట్రంప్ ‘జీరో టారిఫ్’ వ్యాఖ్యలతో కొనుగోళ్ల వెల్లువ
దిగివచి్చన ద్రవ్యోల్బణం, బలపడిన రేట్ల తగ్గింపు ఆశలు
ముంబై: పరస్పర సుంకాలు లేని వాణిజ్యాన్ని భారత్ ప్రతిపాదించిందనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో దలాల్ స్ట్రీట్ గురువారం ఒకటిన్నర శాతం ర్యాలీ చేసింది. భారత్‌తో పాటు యూఎస్ ద్రవ్యోల్బణ దిగిరావడమూ కలిసొచ్చింది. సెన్సెక్స్ 1,200 పాయింట్లు పెరిగి 82,531 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 395 పాయింట్లు బలపడి 2025లో తొలిసారి 25వేల స్థాయిపైన 25,062 వద్ద నిలిచింది. ముగింపు స్థాయి ఇరు సూచీలకు ఏడు నెలల గరిష్టం కావడం విశేషం. ఒక దశలో సెన్సెక్స్ 1,387 పాయింట్లు ఎగసి 82,718 వద్ద, నిఫ్టీ 449 పాయింట్లు దూసుకెళ్లి 25,116 ట్రేడయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.
→ దిగుమతిదారుల నుంచి అమెరికా డాలర్‌కు డిమాండ్ పెరగడంతో భారత కరెన్సీ రూపాయి ఒత్తిడికి లోనైంది. డాలర్ మారకంలో 22 పైసలు బలహీనపడి 85.54 స్థాయి వద్ద స్థిరపడింది.
→ స్టాక్ మార్కెట్ వరుస లాభాలతో బుధ, గురువారాల్లో రూ.9 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్‌ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ రూ.440 లక్షల కోట్లకు చేరింది.
లాభాలు ఎందుకంటే
→ ఖతార్‌లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం మధ్యాహ్నం... ‘‘భారత్ ఒక వాణిజ్య ఒప్పందాన్ని ప్రతిపాదించింది. దీని ప్రకారం అనేక అమెరికా ఉత్పత్తులపై ప్రాథమికంగా సున్నా టారిఫ్‌లు ఉంటాయి’’ అన్నారు. ట్రంప్ ప్రకటనతో మార్కెట్లో సెంటిమెంట్ ఒక్కసారిగా మారిపోయింది. మిడ్‌సెషన్ వరకు ఫ్లాట్‌గానే కదలాడిన సూచీలు భారీ లాభాలు నమోదు చేశాయి.
→ ఇరాన్‌తో అమెరికా అణు ఒప్పందం కుదిరే అవకాశం నేపథ్యంలో సరఫరా పెరుగుతుందనే అంచనాలతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గాయి. భారత్‌కు దిగుమతయ్యే బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 3.50% తగ్గి 63.79 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
→ రిటైల్ ద్రవ్యోల్బణం అరేళ్ల కనిష్టానికి చేరుకోవడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు మరింత బలపడ్డాయి.
→ వరుస మూడు నెలల అమ్మకాల అనంతరం విదేశీ ఇన్వెస్టర్లు ఏప్రిల్ 15 నుంచి భారతీయ ఈక్విటీలలో దాదాపు రూ.50 వేల కోట్లు పెట్టుబడి పెట్టారు. గత 20 సెషన్లలో 19 సార్లు నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఎఫ్‌ఐఐల వరుస కొనుగోళ్లు మన సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి.