ఎట్టకేలకు లాభాలొచ్చాయ్‌

Nifty ends around 17,450, Sensex rises 449 points - Sakshi

8 రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ 

కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్లు 

మెప్పించిన స్థూల ఆర్థిక గణాంకాలు

కలిసొచ్చిన ప్రపంచ పరిణామాలు 

అన్ని రంగాల షేర్లకూ డిమాండ్‌

ముంబై: ఎనిమిది వరుస నష్టాల ముగింపు తర్వాత బుధవారం స్టాక్‌ సూచీలు లాభపడ్డాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు కలిసిరాగా.., దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించాయి. అధిక వెయిటేజీ రిలయన్స్, టీసీఎస్, యాక్సిస్‌ బ్యాంక్, ఎస్‌బీఐ షేర్లు రెండుశాతం రాణించి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఉదయం సెన్సెక్స్‌ 174 పాయింట్ల లాభంతో 59,136 వద్ద, నిఫ్టీ 56 పాయింట్లు పెరిగి 17,360 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

తొలి అరగంట కాస్త తడబడినా.., వెంటనే తేరుకోగలిగాయి. యూరప్‌ మార్కెట్ల లాభాల ప్రారంభం మరింత విశ్వాసాన్నిచ్చింది. ఇటీవల దిద్దుబాటులో భాగంగా కనిష్టాలకు దిగివచ్చిన నాణ్యమైన షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. ఒక దశలో సెన్సెక్స్‌ 513 పాయింట్లు బలపడి 59,475 వద్ద, నిఫ్టీ 164 దూసుకెళ్లి 17,468 వద్ద ఇంట్రాడే గరిష్టాలను తాకాయి. ట్రేడింగ్‌ చివరి వరకు స్థిరమైన లాభాల్లో కదలాడాయి.

ఫలితంగా సెన్సెక్స్‌ 449 పాయింట్లు పెరిగి 59,411 వద్ద, నిఫ్టీ 147 పాయింట్ల లాభంతో 17,451 వద్ద ముగిశాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా మెటల్, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లకు భారీ డిమాండ్‌ నెలకొంది. విస్తృత స్థాయి మార్కెట్లోని చిన్న, మధ్య తరహా షేర్లకు రాణించడంతో మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు వరుసగా 1.38%, 1.35శాతం చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.424 కోట్ల షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,499 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో సింగపూర్‌ మినహా అన్ని దేశాల సూచీలు లాభపడ్డాయి. యూరప్‌ మార్కెట్లు అరశాతం పెరిగాయి.  

► సెన్సెక్స్‌ సూచీ 449 పెరగడంతో బీఎస్‌ఈ ఎక్సే్చంజీలో రూ.3.28 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది.    
► అదానీ గ్రూప్‌లోని మొత్తం పది కంపెనీల షేర్లు లాభపడ్డాయి. అత్యధికంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 15% బలపడింది. అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ విల్మార్, అదానీ పవర్, అదానీ టోటల్‌ గ్యాస్, ఎన్‌డీటీవీ షేర్లు ఐదుశాతం పెరిగి అప్పర్‌ సర్క్యూట్‌ను తాకాయి. అంబుజా సిమెంట్స్‌ 3.32%, ఏసీసీ 2.14%, అదానీ పోర్ట్స్‌ ఒకటిన్నరశాతం చొప్పున లాభపడ్డాయి. దీంతో గ్రూప్‌ మొత్తం కంపెనీల మార్కెట్‌ వ్యాల్యూయేషన్‌ రూ.7.56 లక్షల కోట్లకు చేరింది.

ఎఫ్‌అండ్‌ఓలో చమురు, గ్యాస్‌
ఎన్‌ఎస్‌ఈకి సెబీ గ్రీన్‌సిగ్నల్‌
స్టాక్‌ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ లైట్‌ స్వీట్‌ క్రూడ్‌గా పిలిచే డబ్ల్యూటీఐతోపాటు.. నేచురల్‌ గ్యాస్‌ ఫ్యూచర్స్‌ కాంట్రాక్టులను ప్రవేశ పెట్టనుంది. ఇందుకు సెబీ నుంచి అనుమతి పొందినట్లు ఎన్‌ఎస్‌ఈ తాజాగా వెల్లడించింది.  త్వరలోనే వీటి ఎఫ్‌అండ్‌వో లావాదేవీలను ప్రారంభించనున్నట్లు పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top