25 ఏళ్లలో తొలిసారి.. చైనాలో ఏం జరుగుతుందంటే.. నివేదికలో ఆసక్తికర అంశాలు

Negative FDI In China For The First Time In 25 Years - Sakshi

ప్రపంచ కర్మాగారమని చెప్పుకునే చైనా కథ కీలకమైన మలుపు తిరిగిందా? ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చెలాయిస్తున్న పెత్తనానికి బ్రేకులు పడనున్నాయా? అవునంటున్నాయి తాజా నివేదికలు. పాతికేళ్లుగా అప్రతిహతంగా కొనసాగుతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తొలిసారి తగ్గుముఖం పట్టడాన్ని దీనికి నిదర్శనంగా చూపుతున్నాయి. 

 చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నట్లు చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా విదేశీ పెట్టుబడులు తగ్గిన సమాచారం బయటకొచ్చింది. 1998 తరువాత మొట్టమొదటిసారి 2023 మూడో త్రైమాసికంలో చైనాలోని విదేశీ సంస్థాగత పెట్టుబడులు రూ.98 కోట్ల వరకూ తగ్గినట్లు తెలుస్తోంది. బ్లూమ్‌బెర్గ్ తాజా నివేదిక  ఈ విషయాలను వెల్లడించింది.

చైనాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ యాజమాన్య సంస్థల నుంచి డబ్బు ఇతర దేశాలకు ప్రవహించడం మొదలైంది. చైనాలోని విదేశీ సంస్థాగత పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) తగ్గడానికి పశ్చిమ దేశాలతో ఆ దేశ సంబంధాలు బెడిసికొట్టడం, ఇతర దేశాల్లో అధిక వడ్డీ రేట్లు కారణంగా ఎఫ్‌డీఐలు తరలిపోతున్నట్లు నివేదిక తెలిపింది. అమెరికాతోపాటు ఇతర దేశాలకు చెందిన సెంట్రల్‌బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. అందుకు విరుద్ధంగా మందగిస్తున్న తన ఆర్థిక వ్యవస్థను పెంచడానికి చైనా కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. దాంతో చైనాలో కంటే వడ్డీ ఎక్కువగా ఉన్న ఇతర దేశాల్లోకి పెట్టుబడులు పెట్టడంతో లాభం చేకూరుతుందని విదేశీ పెట్టుబడిదారులు యోచిస్తున్నారు. ఫలితంగా చైనాలో ఎఫ్‌డీఐలు తగ్గిపోతున్నాయి. అయితే గతంలో పరిస్థితులు మెరుగ్గా ఉన్న సమయంలో విదేశీ కంపెనీలు చైనాలో ఆర్జించిన లాభాలను దేశంలో తిరిగి పెట్టుబడి పెట్టేందుకు సుముఖత చూపలేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దాంతో ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం పడుతుందన్నారు. 

ఈ సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 920 బిలియన్ యువాన్లకు (రూ.10లక్షల కోట్లు) చేరుకున్నాయి. ఇది 2022లో ఇదే కాలంతో పోలిస్తే 8.4 శాతం తక్కువ. ఈ ఏడాది యూఎస్‌ డాలర్‌తో పోలిస్తే చైనా కరెన్సీ విలువ క్షీణించింది. పెరుగుతున్న నిరుద్యోగం, రియల్ ఎస్టేట్ సంక్షోభం కారణంగా డిమాండ్ మందగించడంతో చైనా ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో పడినట్లు సర్వే తెలిపింది. చైనాలోని రెండో అతిపెద్ద ప్రాపర్టీ డెవలపర్ ఎవర్‌గ్రాండే ఈ సంవత్సరం ప్రారంభంలో దివాలా కోసం దాఖలు చేసింది. ప్రస్తుతం మరో అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ కంట్రీ గార్డెన్ పతనం అంచున ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎగుమతి ఆధారిత, పారిశ్రామిక రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ కంపెనీల లాభాలు ఈ ఏడాది క్షీణించాయని నివేదిక పేర్కొంది. 

ఇదీ చదవండి: నోట్ల రద్దు తర్వాత రెట్టింపైన నగదు చలామణి! కారణం ఇదేనా..

చైనా బ్యాంకింగ్‌ రంగంలో విదేశీ సంస్థాగత పెట్టుబడులు 2021లో రికార్డు స్థాయిలో 4 ట్రిలియన్ యువాన్‌లు ఉండేవి. అయితే సెప్టెంబర్ చివరి నాటికి 3.19 ట్రిలియన్ యువాన్‌లకు పడిపోయాయని చైనా సెంట్రల్ బ్యాంక్ డేటాను ఉటంకిస్తూ సర్వే తెలిపింది. ఐఎంఎఫ్‌ తన తాజా అంచనా నివేదికలో ప్రాపర్టీ సెక్టార్‌లో కొనసాగుతున్న బలహీనత, మార్కెట్‌లో డిమాండ్‌ తగ్గుదల కారణంగా చైనా వాస్తవ జీడీపీ 2023లో 5.4 శాతానికి పెరుగుతుందని, 2024లో 4.6 శాతానికి మందగించవచ్చని చెప్పింది. అక్కడి జనాభా అధికంగా వృద్ధాప్యంతో బాధపడుతుండడంతో పరిశ్రమల్లో ఉత్పాదకత తగ్గి 2028 నాటికి వృద్ధిరేటు క్రమంగా 3.5 శాతానికి పడిపోతుందని అంచనా.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top