
న్యూఢిల్లీ: దేశీయంగా డేటా వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో టెలికం సదుపాయాలను మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉంటుందని కేంద్ర టెలికం శాఖ కార్యదర్శి 'నీరజ్ మిట్టల్' తెలిపారు. మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ వినియోగానికి మరింత స్పెక్ట్రం అవసరమవుతుందని తెలిపారు. అటు 5జీ సేవల కోసం చేసిన ఇన్వెస్ట్‌మెంట్లపై టెల్కోలకు రాబడులు లభించడం కష్టతరంగా ఉంటున్న నేపథ్యంలో.. ఈ రెండు అంశాల మీద ప్రభుత్వం దృష్టి పెడుతున్నట్లు వివరించారు.
దేశీయంగా డేటా స్పీడ్ సగటున 99–100 ఎంబీపీఎస్ నుంచి 151 ఎంబీపీఎస్‌కి పెరిగినట్లు చెప్పారు. సగటున ప్రతి నెలా ఒక్కో యూజరు దాదాపు 29 గిగాబైట్ల డేటాను వినియోగిస్తున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో 5జీ నుంచి 6జీకి మారాలంటే మౌలిక సదుపాయాలపై భారీగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందని, మరింత స్పెక్ట్రం అవసరమవుతుందని చెప్పారు.
ప్రైవేట్ టెల్కోలు 5జీ సేవల కోసం 2024లో టెలికం మౌలిక సదుపాయాలు, స్పెక్ట్రంపై రూ. 70,000 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. ప్రస్తుతం జియో, భారతి ఎయిర్‌టెల్ 5జీ సర్వీసులను అందిస్తుండగా.. వొడాఫోన్ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్ ఇంకా సేవలను ప్రారంభించాల్సి ఉంది. భారీగా డేటాను వినియోగించే యూజర్లున్నందున నెట్‌ఫ్లిక్స్, మెటా, అమెజాన్, గూగుల్‌లాంటి టెక్ దిగ్గజాలు కూడా తమ ఆదాయాల్లో కొంత భాగాన్ని భారత్‌లో నెట్‌వర్క్ మౌలిక సదుపాయాల కల్పన కోసం అందించాలంటూ టెల్కోలు కోరుతున్నాయి.