‘బై బై ఇండియా’, అందుకే పరాయి దేశం వెళ్తున్న భారతీయులు!

More than 59K Indians were enlisted as US citizens in 2023 - Sakshi

భారత్‌ను వదిలి విదేశాల్లో స్థిరపడుతున్న భారతీయులకు సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. యూఎస్‌ సిటిజన్‌ షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీస్‌ (యూఎస్‌సీఐఎస్‌) ఇటీవలే విడుదల చేసిన 2023 వార్షిక గణాంకాల ప్రకారం.. 2023లో 59 వేల మంది భారతీయులు అమెరికా పౌరసత్వం పొందినట్లు తెలిపింది. 

యూఎస్‌సీఐఎస్‌ నివేదిక ప్రకారం.. 2023 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 8.7 లక్షల మంది విదేశీయులు అమెరికా పౌరులుగా మారారు. వీరిలో 1.1 లక్షల మంది మెక్సికన్లు, 59,100 మంది భారతీయులు అమెరికా పౌరసత్వం పొందగా.. కొత్తగా చేరిన అమెరికన్ పౌరుల్లో 35,200 మంది డొమినికన్ రిపబ్లిక్‌ చెందినవారు కాగా, ఫిలిప్పీన్స్‌ దేశస్తులు 44,800 మంది ఉన్నారు. 

2023 ఆర్థిక సంవత్సరంలో యుఎస్ పౌరసత్వం పొందిన వారు కనీసం 5 ఏళ్లు చట్టబద్ధంగా శాశ్వత నివాసం పొందిన వారు (ఎల్‌పీఆర్‌లుగా Lawful permanent residents) ఉన్నందున పౌరసత్వానికి అర్హులు. కనీసం 3 సంవత్సరాల పాటు ఎల్‌పీఆర్‌లుగా ఉండటానికి అర్హులైన యుఎస్ పౌరురుల వివాహం చేసుకున్న దరఖాస్తుదారులు కూడా ఉన్నారు. కొంతమంది దరఖాస్తుదారులు సైనిక సేవ ఆధారంగా కూడా అమెరికా పౌరసత్వాన్ని అందించినట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్‌ డేటా వెలుగులోకి వచ్చింది. 

ఈ తరుణంలో భారతీయులు స్వదేశం పౌరసత్వం వదిలేసి అమెరికాతో పాటు ఇతర దేశాల్లో ఎందుకు వలస వెళ్తున్నారనే అంశంపై పలు కారణాలున్నాయని నివేదికలు వెలుగులోకి వచ్చాయి.  

ఉపాధి అవకాశాలు: చాలా మంది భారతీయులు విదేశాల్లో మెరుగైన ఉద్యోగావకాశాలు, కెరీర్ ఎదుగుదలను కోరుకుంటారు. యూఏఈ, అమెరికా, సౌదీ అరేబియా వంటి దేశాలు గణనీయమైన సంఖ్యలో భారతీయ వలసదారులకు ఆతిథ్యం ఇస్తున్నాయి. 

విద్య: ఉన్నత విద్యను అభ్యసించడం మరో ప్రేరణ. మహమ్మారి కారణంగా వలసదారులపై ఆంక్షలు అమల్లోకి రాకముందు సుమారు 5.9 లక్షల మంది భారతీయ విద్యార్థులు అంతర్జాతీయ క్యాంపస్‌లలో చదివేందుకు వెళ్లారు. మహమ్మారి సమయంలో ఈ తగ్గినప్పటికీ, కోవిడ్ ప్రోటోకాల్స్ సడలించడంతో వారు సంఖ్య క్రమంగా పెరుగుతుంది.  

జీవన ప్రమాణాలు: మెరుగైన జీవన ప్రమాణాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కోసం కొందరు భారతీయులు విదేశాలకు వెళ్తుంటారు. కెనడా, యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ కింగ్ డమ్ వంటి దేశాలు మెరుగైన జీవన ప్రమాణాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నాయి.  

కుటుంబ సభ్యులతో ఉండేందుకు : ఇప్పటికే విదేశాల్లో స్థిరపడిన కుటుంబ సభ్యులతో తిరిగి కలవడం ఒక సాధారణ కారణం. ఆత్మీయులకు దగ్గరగా ఉండాలనే కోరిక వలసలు పెరిగేందుకు మరో కారణం 

ఆర్థిక స్థిరత్వం: వ్యక్తులు తరచుగా వారి మెరుగైన జీవితం గడిపేందుకు డబ్బు సంపాదన, అందుకు తగిన అవకాశాల్ని కోరుకుంటారు. ఫలితంగా పటిష్టమైన ఆర్థిక వ్యవస్థలు ఉన్న దేశాల్లో స్థిరపడుతున్నారు.  

పౌరసత్వాన్ని వదులుకోవడం: 2011 నుండి 1.6 మిలియన్లకు పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఇందులో 2022 లో 1,83,741 మంది ఉన్నారు. ఇతర దేశాల్లో పౌరసత్వం కోరుకునే భారతీయులకు అమెరికా తొలిస్థానంలో ఉంది.  

ప్రవాస భారతీయులు ఆర్థిక, విద్యా, వ్యక్తిగత కారకాల కలయికతో ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడ్డారు. కెరీర్ పురోభివృద్ధి కోసమో, విద్య కోసమో, కుటుంబ బంధాల కోసమో భారతీయులు తమ మాతృభూమికి వెలుపల అవకాశాలను అన్వేషిస్తూనే ఉన్నారు.

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top