
దేశంలో మొబైల్ రీచార్జ్ ప్లాన్‌ల ధరలు మళ్లీ పెరుగనున్నాయి. టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది చివరి నాటికి మొబైల్ టారిఫ్‌లను పెంచవచ్చని తెలుస్తోంది. ధరల పెరుగుదల 10 నుంచి 12 శాతం వరకు ఉండొచ్చని ఓ వార్తా నివేదిక తెలిపింది. 2024 జూలైలో బేస్ ధరలను 11 నుండి 23 శాతం పెంచిన భారతీయ టెలికాం కంపెనీలు ఈసారి కొత్త విధానాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, మే నెలలో బలమైన క్రియాశీలక యూజర్ల పెరుగుదలే ఈ పెంపునకు కారణమని చెబుతున్నారు.
మళ్లీ మొబైల్ టారిఫ్‌ల పెంపు
భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాతో సహా భారతీయ టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది చివరి నాటికి మొబైల్ టారిఫ్‌లపై తాజా పెంపును విధించవచ్చని ఈటీ టెలికాం నివేదిక తెలిపింది. ఈ పెరుగుదల 10-12 శాతం మధ్య ఉంటుందని, మిడ్-టు-హై-ప్రైస్ రీఛార్జ్ ప్లాన్లను కొనుగోలు చేసే వినియోగదారులను కంపెనీలు లక్ష్యంగా చేసుకోవచ్చని తెలిపింది.
టారిఫ్‌ల పెంపుతో యాక్టివ్ సబ్‌స్క్రైబర్లు వేరే టెలికాం నెట్‌వర్క్ ప్రొవైడర్‌కు మళ్లకుండా ఆపరేటర్లు టైర్డ్ విధానంపై దృష్టి సారించారు. మే నెలలో యాక్టివ్ సబ్‌స్క్రైబర్ల బలమైన వృద్ధి మరోసారి ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని చెబుతున్నారు. ఈ 31 రోజుల్లో భారతీయ టెలికాం రంగంలో 7.4 మిలియన్ల క్రియాశీల చందాదారులు పెరిగారు. 29 నెలల్లో ఇదే అత్యధికం. దీంతో మొత్తం యాక్టివ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 1.08 బిలియన్లకు చేరింది.