
ప్రస్తత పరిస్థితిలో ఐటీ ఉద్యోగం తెచ్చుకోవడం ఎంత కష్టమో.. దాన్ని నిలబెట్టుకోవడమూ అంతే కష్టం. ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంపొందించుకుంటూ మంచి పనితీరు కనబర్చాలి. వెనకబడిన ఉద్యోగులను కంపెనీలు ఉపేక్షించడం లేదు. వెంటనే ఉద్వాసన పలుకుతున్నాయి. దీనికి సంబంధించే ప్రపంచ టెక్ దిగ్గజం కీలక నిర్ణయం తీసుకుంది.
పనితీరు సమస్యలతో ఉద్యోగం కోల్పోయి కంపెనీని వీడిన ఉద్యోగులపై మైక్రోసాఫ్ట్ రెండేళ్ల నిషేధం విధానాన్ని ప్రవేశపెట్టింది. అంటే ఇలా జాబ్ పోగుట్టుకుంటే మళ్లీ రెండేళ్ల వరకూ ఆ ఛాయలకూ కూడా వెళ్లే అవకాశం ఉండదన్న మాట. అంతేకాదు.. ఈ ఉద్యోగాల కోతలను 'గుడ్ అట్రిషన్'గా పిలుస్తారు. అంటే కంపెనీని విడిచిపెట్టాలనుకునే ఉద్యోగులను సంతోషం.. దయచేయండి.. అని భావిస్తుందని బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక తెలిపింది.
గత రెండు నెలలుగా మైక్రోసాఫ్ట్ తన సిబ్బంది పనితీరు నిర్వహణ ప్రక్రియను పునర్‌వ్యవస్థీకరిస్తోంది. పనితీరు తక్కువగా ఉన్న ఉద్యోగులపై కంపెనీ కఠినంగా వ్యవహరించింది. పనితీరు కనబరచని ఉద్యోగులను తొలగించే సంస్థ వ్యూహంలో భాగంగా ఈ రెండు కొత్త టూల్స్ ఉన్నాయి.

ఈ ఏడాది పనితీరు తక్కువగా ఉన్న 2000 మంది ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ తొలగించింది. పనితీరు సరిగా లేని ఉద్యోగులకు కంపెనీ సెవెరెన్స్ ప్యాకేజీ కూడా ఇవ్వలేదు. బిజినెస్ ఇన్‌సైడర్ ప్రకారం కంపెనీ 'గుడ్ అట్రిషన్' ప్రణాళిక ప్రతి సంవత్సరం నిర్ణీత శాతం ఉద్యోగులను తొలగించాలన్న కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది.
బడా టెక్ కంపెనీల పనితీరు విధానాల్లో మార్పు
బడా టెక్ కంపెనీల్లో ఉద్యోగుల నిలుపుదల, పనితీరు విధానాల్లో విస్తృత మార్పు వచ్చింది. మెటా, అమెజాన్ వంటి కంపెనీలు కూడా తమ ప్రస్తుత, ఔట్ గోయింగ్ ఉద్యోగుల పనితీరుపై కఠిన విధానాలను ప్రవేశపెట్టాయి. గతంలో అమెజాన్ 'అన్ గ్రేటెడ్ అట్రిషన్'ను ప్రవేశపెట్టింది.దీని ప్రకారం మేనేజర్లు ప్రతి సంవత్సరం తమ బృందంలో కొంత మందిని తొలగించాల్సి ఉంటుంది. పనితీరు తక్కువగా ఉన్న తమ ఉద్యోగులపై కూడా మెటా వేటు వేస్తోంది. బిజినెస్ ఇన్‌సైడర్ ప్రకారం ఇక తిరిగి నియమించుకోకూడదనంటూ కొంతమంది మాజీ ఉద్యోగులను ఈ కంపెనీ జాబితా చేసిపెట్టుకుంది.