మార్కెట్లో ‘పాజిటివ్‌’ కొనుగోళ్లు

Market: Indices At Day High Led By Auto And Metals - Sakshi

ఏడు వారాల్లో అతిపెద్ద లాభం
మార్కెట్‌ దాదాపు రెండు శాతం లాభంతో ఒక్కరోజులోనే రూ.3.1 లక్షల కోట్ల సంపద ఇన్వెస్టర్ల సొంతమైంది. దీంతో  బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.213.66 లక్షల కోట్లకు చేరుకుంది.

ముంబై: కరోనా రోజువారీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం దేశీయ ఈక్విటీ మార్కెట్‌కు కలిసొచ్చింది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతానికి కేంద్రం తీసుకున్న చర్యలు ఇన్వెస్టర్లను మెప్పించాయి. కంపెనీల క్యూ4 ఆర్థిక ఫలితాలతో పాటు స్థూల ఆర్థిక గణాంకాలు అంచనాలకు అనుగుణంగా నమోదయ్యాయి. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ర్యాలీ కూడా సెంటిమెంట్‌ను బలపరిచింది. ఈ సానుకూలాంశాలతో స్టాక్‌ మార్కెట్‌ సోమవారం ఏడువారాల్లో అతిపెద్ద లాభాన్ని ఆర్జించింది. సెన్సెక్స్‌ 848 పాయింట్లు పెరిగి 49,581 వద్ద ముగిసింది.

నిఫ్టీ 245 పాయింట్లు ర్యాలీ చేసి 14,900 స్థాయిపైన 14,923 వద్ద నిలిచింది. బ్యాంకింగ్, ఆటో, మెటల్‌ షేర్లు రాణించి సూచీల ర్యాలీకి ప్రాతినిధ్యం వహించాయి. మీడియా, ఫార్మా, టెలికాం షేర్లలో అమ్మకాలు జరిగాయి. చిన్న, మధ్య తరహా షేర్లకు కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడంతో బీఎస్‌ఈ స్మాల్, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌లు రెండు శాతం ఎగశాయి. సెన్సెక్స్‌  30 షేర్లలో 23 షేర్లు లాభపడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 826 పాయింట్లు, నిఫ్టీ 260 పాయింట్ల మేర లాభపడ్డాయి.  

ట్రేడింగ్‌ ఆద్యంతం లాభాలే...  
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్‌ ఉదయం భారీ లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 260 పాయింట్ల లాభంతో 48,991 వద్ద, నిఫ్టీ 78 పాయింట్లు పెరిగి 14,756 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.  సెన్సెక్స్‌ 826 పాయింట్లు పెరిగి 49,628 వద్ద, నిఫ్టీ 260 పాయింట్ల మేర లాభపడి 14,938 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. 

సూచీల ర్యాలీ కారణాలు

ఊరటనిచ్చిన కరోనా కేసుల తగ్గుదల...  
దేశంలో కరోనా కేసులు వరుసగా నాలుగో రోజూ తగ్గుముఖం పట్టాయి. రోజూవారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య మూడు లక్షలకు దిగువకు వచ్చింది. కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్‌ ఆంక్షల ఎత్తివేత ఉండొచ్చని, ఈ చర్యతో దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ వేగవంతంగా ఉండొచ్చనే ఆశలు ఇన్వెస్టర్లను కొనుగోళ్లకు ప్రేరేపించాయి.  
వ్యాక్సినేషన్‌ ఉత్సాహం...  
నెమ్మదించిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్రం తీసుకున్న చర్యలు మార్కెట్‌ను మెప్పించాయి. రెండో విడత స్పుత్నిక్‌–వి టీకాలు భారత్‌కు చేరుకున్నాయి. అత్యవసర వేళలో వినియోగానికి అందుబాటులోకి వచ్చిన ఈ టీకా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభమైంది. కొత్త వేరియంట్లపైనా కోవాగ్జిన్‌ సమర్థంగా పనిచేస్తుందన్న వార్తలు సూచీల సెంటిమెంటును బలపర్చాయి. 
మెప్పించిన గణాంకాలు...  
ముందుగా చైనా విడుదల చేసిన మెరుగైన ఏప్రిల్‌ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సంకేతాలను నింపాయి. తదుపరి మన మార్కెట్‌ ట్రేడింగ్‌ సమయంలో వెల్లడైన దేశీయ ఏప్రిల్‌ టోకు ద్రవ్యోల్బణ డేటా ఆర్థికవేత్తల అంచనాలకు తగ్గట్లుగానే నమోదైంది. పలు కంపెనీలు తమ మార్చి క్వార్టర్‌ ఫలితాలను మెరుగ్గా ప్రకటించడం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచింది.  

మార్కెట్లో విశేషాలు...  

  • మార్చి త్రైమాసిక ఫలితాలు ఈ శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో ఎస్‌బీఐ షేరు ఆరు లాభపడి రూ.383 వద్ద ముగిసింది. ఈ ధర షేరుకు ఎనిమిది వారాల గరిష్టస్థాయి. 
  • స్పుత్నిక్‌ వి టీకాను తయారు చేసేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌తో ఒప్పందం కుదుర్చుకోవడంతో శిల్ప మెడికేర్‌ షేరు 12 శాతం ర్యాలీ చేసి రూ.510 వద్ద స్థిరపడింది.  
  • నాలుగో క్వార్టర్‌ ఫలితాల ప్రకటన తర్వాత ఎల్‌అండ్‌టీ షేరులో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. ఫలితంగా షేరు రెండు శాతం క్షీణించి రూ.1387 వద్ద ముగిసింది.  
  • మెరుగైన ఆర్థిక ఫలితాలతో పాటు బైబ్యాక్‌ను ప్రకటించడంతో క్విక్‌ హీల్‌ షేరు 20% లాభపడి రూ.228 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది.

భారీ లాభాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్లు
మంగళవారం కూడా స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో మొదలయ్యాయి.  ఉదయం 9.35 గంటల సమయానికి సెన్సెక్స్‌ 50,161 వద్ద, నిఫ్టీ 15, 102 వద్ద కొనసాగుతున్నాయి. ఇక హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా స్టీల్ లాభాల్లో పయనిస్తుండగా, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాల బాటపట్టాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top