ప్రధాన పోర్టుల్లో పడిపోయిన రవాణా

Major ports cargo traffic falls for 6th straight month in September - Sakshi

ఆరు నెలల్లో 14 శాతం క్షీణత

న్యూఢిల్లీ: దేశంలోని 12 ప్రధాన నౌకాశ్రయాల్లో (పోర్టులు) కార్గో రద్దీ(నౌకా రవాణా) సెప్టెంబర్‌ నెలలోనూ క్షీణతను నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో నౌకా రవాణా (ఏప్రిల్‌–సెప్టెంబర్‌) 14 శాతం తగ్గి 298.55 మిలియన్‌ టన్నులుగా (ఎంటీ) నమోదైంది. ఈ వివరాలను పోర్టుల అసోసియేషన్‌ (ఐపీఏ) తెలిపింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 348 ఎంటీల రవాణా నమోదు కావడం గమనార్హం. మార్చి నుంచి నౌకా రవాణా 12 పోర్టుల్లో చెప్పుకోతగినంత పడిపోయిందని, కరోనా వైరస్సే కారణమని షిప్పింగ్‌ శాఖా మంత్రి మన్‌ సుఖ్‌ మాండవీయ పేర్కొన్నారు. ఒక్క మర్ముగావో పోర్ట్‌ మినహాయించి మిగిలిన ప్రధాన పోర్టులు అన్నింటిలోనూ సెప్టెంబర్‌ వరకు రవాణా ప్రతికూలంగానే ఉంది.

నౌకాశ్రయాల వారీగా పరిశీలిస్తే..
కామరాజర్‌ పోర్ట్‌ (ఎన్నోర్‌)లో రవాణా ఏప్రిల్‌–సెప్టెంబర్‌ కాలంలో 32 శాతం మేర పడిపోయి 10.77 ఎంటీలుగా ఉంది. అదే విధంగా చెన్నై నౌకాశ్రయంలో 26 శాతం వరకు తగ్గి 18.38 ఎంటీలుగా నమోదైంది. కొచ్చిన్‌ పోర్టులో 24 శాతం తగ్గి 12.58 ఎంటీలుగా ఉండగా.. జేఎన్‌ పీటీలో నౌకా రవాణా పరిమాణం 22 శాతం మేర తగ్గి 27 మిలియన్‌ టన్నులుగా నమోదైంది. కోల్‌కతా పోర్టులో 19 శాతం క్షీణించి 25.56 ఎంటీలుగా, ముంబై పోర్టులో 19 శాతం తగ్గి 24.45 ఎంటీలుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహణలోని 12 ప్రధాన పోర్టుల్లో దీనదయాళ్‌ (కాండ్లా), ముంబై, జేఎన్‌ పీటీ, మర్ముగావో, న్యూ మంగళూరు, కొచ్చిన్, చెన్నై, కామరాజర్‌ (ఎన్నోర్‌), వీవో చిదంబర్‌ నార్, విశాఖపట్నం, పారదీప్, కోల్‌కతా (హాల్దియా కలిపి) ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top