
2025–26లో 25 శాతం తగ్గొచ్చు
రూ.4.88 లక్షల కోట్లుగా అంచనా
ప్రణాళిక శాఖ సర్వే వెల్లడి
న్యూఢిల్లీ: ప్రైవేటు మూలధన వ్యయాలు (పెట్టుబడులు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25 శాతం మేర తగ్గిపోవచ్చని కేంద్ర ప్రభుత్వ సర్వే అంచనా వేసింది. రూ.4.88 లక్షల కోట్లుగా ఉండొచ్చని కేంద్ర ప్రణాళికలు, కార్యక్రమాల అమలు శాఖ నిర్వహించిన ‘ఫార్వార్డ్ లుకింగ్ సర్వే’ తెలిపింది. 2024–25లో ప్రైవేటు రంగ మూలధన వ్యయాలు రూ.6.56 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. 2023–24లో రూ.4.22 లక్షల కోట్లు కాగా, 2022–23లో రూ.5.72 లక్షల కోట్లు, 2021–22లో రూ.3.94 లక్షల కోట్లుగా ఉన్నట్టు ఈ సర్వే నివేదిక వెల్లడించింది.
వీటి ప్రకారం 2021–22 నుంచి 2024–25 మధ్య కాలంలో మొత్తం మీద ప్రైవేటు రంగ మూలధన వ్యయాలు 66.3 శాతం పెరిగా యి. 2021–22లో ఒక్కో సంస్థ గ్రాస్ ఫిక్స్‌డ్ అస్సెట్ (జీఎఫ్‌ఏ) రూ.3,151 కోట్లుగా ఉంది. ఇది 2022–23లో రూ.3,279 కోట్లకు (4 శాతం వృద్ధి).. 2023–24లో రూ.4,183 కోట్లకు (27 శాతం వృద్ధి) పెరిగింది. విద్యుత్, గ్యాస్, స్టీమ్, ఎయిర్ కండీషనింగ్ సప్లై విభాగంలో ఒక కంపెనీ నుంచి అత్యధిక జీఎఫ్‌ఏ రూ.14,000 కోట్లుగా ఉంది.
2021–22లో ఒక్కో సంస్థ సగటున రూ.109 కోట్లను మూలధన వ్యయాలపై వెచ్చించింది. 20 22–23లో ఇది రూ.149 కోట్లు, 2023–24లో రూ. 1.07 కోట్లు, 2024–25లో రూ.172 కోట్ల చొప్పున ఉన్నాయి. తయారీ రంగం నుంచి 43.8 % మూ లధన వ్యయాలు ఉంటే.. ఐటీ నుంచి 15.6 %, రవాణా, స్టోరేజీ నుంచి 14 % చొప్పున ఉన్నాయి.
వృద్ధి కోసమే పెట్టుబడులు.. ప్రస్తుత ఆస్తుల విలువను పెంచుకోవడంపై పెట్టుబడులకు 28.4 శాతం కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. 11.5 శాతం సంస్థలు అవకాశాలను విస్తృతం చేసుకోవడంపై ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఆదాయ వృద్ధి కోసం 2024–25లో మూలధన వ్యయాలు చేసినట్టు 49.6 శాతం ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు తెలిపారు. 30.1 శాతం సంస్థలు సామర్థ్యాల పురోగతికి, 2.8 శాతం సంస్థలు వైవిధ్యంపై పెట్టుబడులు పెట్టినట్టు వెల్లడించాయి.