
వ్యవసాయం లాభసాటిగా మారాలి
పేదరికాన్ని మరింతగా రూపుమాపొచ్చు
ఐఎఫ్‌ఏడీ ప్రెసిడెంట్ అల్వారో లారియో
న్యూఢిల్లీ: గ్రామీణ రంగంలోకి మరిన్ని ప్రైవేటు పెట్టుబడులు తీసుకురావడానికే తమ ప్రాధాన్యతని ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ (ఐఎఫ్‌ఏడీ) ప్రెసిడెంట్ అల్వారో లారియో తెలిపారు. మరే ఇతర రంగంతో పోల్చి చూసినా వ్యవసాయ రంగంలో పెట్టుబడులు మూడు రెట్లు అధికంగా పేదరిక నిర్మూలనకు సాయపడతాయని చెప్పారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అంతర్జాతీయంగా 75 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయన్నారు.
1977లో ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ఏజెన్సీ, ఆర్థిక సంస్థగా ఏర్పాటైన ఐఎఫ్‌ఏడీ గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక, ఆకలి బాధల నిర్మూలన కోసం కృషి చేస్తుంటుంది. గ్రామీణ ప్రాంతాల కోసం దీర్ఘకాలిక రుణాలను సమీకరించడం, తద్వారా దీర్ఘకాల ఫలితాలను సాధించడం ఐఎఫ్‌ఏడీ ప్రాధాన్యతగా లారియో చెప్పారు. భారత్‌తో 50 ఏళ్లకు పైగా అనుబంధం ఉందని, ఐఎఫ్‌ఏడీ వ్యవస్థాపక సభ్య దేశాల్లో భారత్ కూడా ఒకటని గుర్తు చేశారు. అతిపెద్ద రుణ గ్రహీతతోపాటు నిధుల విరాళంలోనూ భారత్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు పేర్కొన్నారు.
భారత్ ముందు మూడు కీలక ప్రశ్నలు..
‘‘భారత్ ముందు మూడు ముఖ్యమైన ప్రశ్నలున్నాయి. రైతులకు వ్యవసాయం మరింత లాభదాయకంగా ఎలా మార్చగలం? వాతావరణపరమైన ఎన్నో సవాళ్ల మధ్య ఉత్పాదకతను పెంచడం ఎలా? ఆహార భద్రత నుంచి పోషకాహార భద్రత దిశగా ఎలా ముందుకు వెళ్లాలి?’’అని అల్వారో లారియో ప్రశ్నలు సంధించారు. ఉష్ణోగ్రతలు పెరగడం, అసహజ వర్షపాతం తదతర వాతావరణపరమైన మార్పులు ప్రపంచ ఆహార భద్రతకు అతిపెద్ద ముప్పుగా పేర్కొన్నారు.
ఇప్పటికే ఈ విధమైన మార్పులు పంట దిగుబడులు, ఉపాధిపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నట్టు తెలిపారు. భారత్‌లో సీజన్‌వారీ నీటి కరువు, ఉష్ణోగ్రతల పెరుగుదల, కరువు సమస్యలున్నట్టు చెప్పారు. భారత జీడీపీలో వ్యవసాయం 20 శాతం వాటాతో, 42 శాతం మందికి ఉపాధి కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే వ్యవసాయ రంగంలో పురోగతి సాధించినప్పటికీ.. పేదలను సైతం ఆర్థిక సేవల్లో భాగం చేయడం, చిన్న ఉత్పత్తిదారులకు మార్కెట్ అనుసంధానత కల్పించడం కీలకమని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా ప్రైవేటు పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.