నికర పన్ను  వసూళ్లు డౌన్‌.. | Net Direct Tax collection dips 1.39% to Rs4. 59 lakh crore in April-June 2025 | Sakshi
Sakshi News home page

నికర పన్ను  వసూళ్లు డౌన్‌..

Jun 22 2025 6:21 AM | Updated on Jun 22 2025 6:21 AM

Net Direct Tax collection dips 1.39% to Rs4. 59 lakh crore in April-June 2025

ఇప్పటివరకు రూ. 4.59 లక్షల కోట్లే వసూలు 

అడ్వాన్స్‌ ట్యాక్స్‌ వసూళ్లు తగ్గడం, రిఫండ్‌లు పెరగడం కారణం 

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు నికర పన్ను వసూళ్లు రూ. 4.59 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధితో పోలిస్తే 1.39 శాతం తగ్గాయి. అడ్వాన్స్‌ ట్యాక్స్‌ వసూళ్లు నెమ్మదించడం, రిఫండ్‌లు అధిక స్థాయిలో ఉండటం ఇందుకు కారణం. రిఫండ్‌లు 58 శాతం పెరిగి రూ. 86,385 కోట్లకు చేరాయి. కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

 కార్పొరేట్ల లాభదాయకత, వ్యక్తుల ఆదాయాలను ప్రతిబింబించే అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లింపులు ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 19 మధ్యకాలంలో సుమారు 4 శాతం పెరిగి రూ. 1.56 లక్షల కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో ఇది 27 శాతం వృద్ధి నమోదు చేసింది. కార్పొరేట్లు చెల్లించిన అడ్వాన్స్‌ ట్యాక్స్‌ సుమారు 6 శాతం వృద్ధితో రూ. 1.22 లక్షల కోట్లకు చేరగా, వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు సహా కార్పొరేట్‌యేతరుల చెల్లింపులు 2.68 శాతం క్షీణించి రూ. 33,928 కోట్లకు పరిమితమయ్యాయి. 

సాధారణంగా అడ్వాన్స్‌ ట్యాక్స్‌ను నాలుగు విడతల్లో (జూన్, సెప్టెంబర్, డిసెంబర్, మార్చి) చెల్లిస్తారు. మరోవైపు, స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు సుమారు 5 శాతం పెరిగి రూ. 5.45 లక్షల కోట్లకు పెరిగాయి. సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ (ఎస్‌టీటీ) 12 శాతం పెరిగి రూ. 13,013 కోట్లకు చేరింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ. 25.20 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లను లక్ష్యంగా పెట్టుకుంది. క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 12.7 శాతం అధికం. జూన్‌ 19 వరకు నిర్దేశించుకున్న టార్గెట్‌లో 18.21 శాతం వసూళ్లను ప్రభుత్వం సాధించింది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌టీటీ ద్వారా రూ. 78,000 కోట్లు వసూలు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకుంది. 

Advertisement
 
Advertisement
Advertisement