గాల్లో విమానం.. పైలట్‌ లేకుండా ప్రయాణం! | Lufthansa flight Fly Without Pilot For 10 Minutes in 2024 | Sakshi
Sakshi News home page

గాల్లో విమానం.. పైలట్‌ లేకుండా ప్రయాణం!

May 18 2025 9:55 AM | Updated on May 18 2025 10:07 AM

Lufthansa flight Fly Without Pilot For 10 Minutes in 2024

గాల్లో విమానం.. 200 మందికి పైగా ప్రయాణికులు.. కానీ పైలట్‌ లేడు.. పరిస్థితి తలుచుకుంటేనే గుండె జలదరిస్తోంది కదా.. బలహీనమైనవారైతే పై ప్రాణాలు పైనే పోతాయి! స్పెయిన్ కు వెళ్తున్న ఓ విమానంలో ఇలాగే జరిగింది. ఆ ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న వారంతా కొన్ని నిమిషాలపాటు వణికిపోయారు. తర్వాత ఏం జరిగిందీ.. ప్రయాణికులు ఎలా బయటపడ్డారన్నదీ.. ఏడాది క్రితం జరిగిన ఈ సంఘటన గురించి జర్మనీ వార్తా సంస్థ డీపీఏ తాజాగా తెలిపింది.

గత ఏడాది స్పెయిన్ కు వెళ్తున్న లుఫ్తాన్సా విమానం కో పైలట్ స్పృహ తప్పి పడిపోయినా 10 నిమిషాల పాటు అలాగే ప్రయాణించిందని డీపీఏ వెల్లడించింది. 2024 ఫిబ్రవరి 17న ఫ్రాంక్ఫర్ట్ నుంచి స్పెయిన్‌లోని సెవిల్లెకు ఎయిర్‌బస్‌ ఏ321 విమానం బయలుదేరింది. ఫ్టైట్‌ కెప్టెన్ రెస్ట్‌ రూమ్‌కు వెళ్లిన 
సమయంలో కాక్‌పిట్‌లో ఒక్కడే ఉన్న కో పైలట్‌ స్పృహ తప్పి పడిపోయాడని స్పానిష్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ సీఐఏఐఏసీ నివేదికను ఉటంకిస్తూ డీపీఏ వివరించింది.

అలా 199 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వెళ్తున్న ఈ విమానం పైలట్ లేకుండానే 10 నిమిషాల పాటు ఎగిరింది.దర్యాప్తు నివేదిక గురించి తమకు తెలుసని, తమ సొంత ఫ్లైట్ సేఫ్టీ విభాగం కూడా దర్యాప్తు జరిపిందని లుఫ్తాన్సా డీపీఏకు తెలిపింది. అయితే దర్యాప్తు ఫలితాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదని డీపీఏ తెలిపింది.

తర్వాత ఏం జరిగింది?
అపస్మారక స్థితిలో ఉన్న కో-పైలట్ అనుకోకుండా నియంత్రణలను ఆపరేట్ చేసినప్పటికీ చురుకైన ఆటోపైలట్ కారణంగా విమానం కుదుపులు లేకుండా గాల్లో స్థిరంగా ఎగరగలిగింది. ఈ సమయంలో వాయిస్ రికార్డర్ కాక్ పిట్ లో వింత శబ్దాలను రికార్డ్ చేసిందని, అవి తీవ్రమైన ఆరోగ్య అత్యవసర పరిస్థితికి అనుగుణంగా ఉన్నాయని డీపీఏ నివేదించింది.

ఫ్లైట్‌ కెప్టెన్ రెస్ట్‌ రూం నుంచి వచ్చి కాక్‌పిట్‌లోకి ప్రవేశించేందుకు రెగ్యులర్ డోర్ ఓపెనింగ్ కోడ్ ను ఎంటర్ చేయడానికి ప్రయత్నించాడు. ఇది కాక్ పిట్ లో బజర్ ను ప్రేరేపిస్తుంది. దీంతో కో-పైలట్ డోర్ తెరుస్తారు. కానీ లోపల ఉన్న  కో పైలట్‌ నుంచి స్పందన లేదు. ఇలా అయిదు సార్లు ప్రయత్నించినా ఫలితం లేదు. క్రూ సిబ్బంది ఒకరు ఆన్‌బోర్డ్‌ టెలిఫోన్ ద్వారా కో పైలట్‌ను  సంప్రదించడానికి ప్రయత్నించారు.

అయినా కో పైలట్‌ స్పందించలేదు. దీంతో చేసేదేమీ లేక కెప్టెన్ చివరి ఎమర్జెన్సీ కోడ్ టైప్ చేశాడు. అది కెప్టన్‌ స్వయంగా తలుపు తెరవడానికి అనుమతిస్తుంది. అయితే డోర్ ఆటోమేటిక్ గా తెరుచుకునేలోపు స్పృహలోకి వచ్చిన కో పైలట్ లోపలి నుంచి డోర్‌ ఓపెన్ చేశారు. తర్వాత మాడ్రిడ్ లో విమానాన్ని ల్యాండింగ్ చేసి అక్కడ అతన్ని ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement