జీతంగా నగదు బదులు బంగారం.. కారణం ఏంటంటే?

London Based Company Pay Salary As Gold to Its Employees - Sakshi

అతడికేంటీ మంచి కంపెనీలో ఉద్యోగం! బంగారం లాంటి జీతం అంటుంటారు మాటవరసకి. కానీ లండన్‌లో ఓ కంపెనీ మాటవరుసకే కాదు నిజంగానే బంగారాన్నే జీతంగా చెల్లిస్తోంది. నగదు చెల్లింపులు మంచిది కాదంటోంది. ఇందుకు గల కారణాలను సహేతుంగా వివరిస్తోంది..

ఉద్యోగుల సంక్షేమానికి చాలా కంపెనీలు ప్రాధాన్యత ఇస్తాయి. పని చేయించుకున్నాం దానికి తగ్గ వేతనం ఇచ్చేశాం అని ఊరుకోకుండా ఆ డబ్బుకు విలువ ఎలా ఉంటుందో కూడా లెక్కకడుతున్నాయి కొన్ని కంపెనీలు. సోసైటీలో నగదు విలువ తగ్గిపోతుందని భావిస్తే ప్రత్యామ్నాయ చర్యలకు ఉపక్రమిస్తున్నాయి.

ఆర్థిక పాఠాలు
ఇంగ్లండ్‌కి చెందిన టాలీమనీ అనే సంస్థ ఫైనాన్షియల్‌ సర్వీసులు అందిస్తోంది. ఈ సంస్థ ఎంతో మందికి ఆర్థిక సూచనలు అందిస్తూ ఉంటుంది. ఇలా సలహాలు ఇవ్వడమే కాదు మేము కూడా స్వయంగా పాటిస్తామంటున్నాడు ఆ కంపెనీ సీఈవో కెమెరాన్‌ పెర్రీ. ఇందుకు సంబంధించిన వివరాలను లండన్‌ కేంద్రంగా వెలువడే సిటీ ఏఎం పత్రిక ప్రచురించింది.

పౌండ్ల కంటే బెటర్‌
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగమనంలో ఉంది. ద్రవ్యోల్బణ పరిస్థితులు నెలకొన్నాయి.  రోజురోజుకి పౌండ్ల విలువ పడిపోతుంది. జీతం తీసుకున్న రోజు నుంచి అది ఖర్చు చేసే రోజుకే పౌండ్ల విలువలో క్షీణత నమోదు అవుతోంది. ఇలా ద్రవ్యోల్బణం కారణంగా తమ కంపెనీ ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది రావొద్దనే లక్ష్యంతో సరికొత్త జీతం చెల్లింపులకు శ్రీకారం చుట్టారు మనీలాటీ సీఈవో కెమరాన్‌ పెర్రీ. 

విలువ పడిపోదు
మనీటాలీలో ఉద్యోగులకు నెలవారీ జీతాన్ని నగదు రూపంలో కాకుండా బంగారం రూపంలో ఇవ్వాలని నిర్ణయించారు. నగదు విలువ రోజురోజుకి పడిపోతుంది. కానీ బంగారం విలువ పడిపోవడం లేదు. పైగా విలువ పెరగడంలో బంగారానికి సాటి రాగలవి లేవు. అందుకే జీతంగా విలువ కోల్పోతున్న నగదు పౌండ్లకు బదులు బంగారాన్ని ఇస్తున్నారు. ముందుగా టాప్‌ మేనేజ్‌మెంట్‌లో ఈ నిర్ణయం అమలు జరిపి సానుకూల ఫలితాలు వచ్చాక ఇప్పుడు కింది స్థాయి సిబ్బందికి కూడా వర్తింప చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీలో ఇరవై మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు.

చదవండి: పసిడి డిమాండ్‌కు ధర దడ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top