పసిడి డిమాండ్‌కు ధర దడ

India Q1 Gold Demand Declines 18percent Amid Higher Prices - Sakshi

మార్చి త్రైమాసికంలో 19 శాతం డౌన్‌

డబ్ల్యూజీసీ నివేదిక  

ముంబై: భారత్‌ బంగారం డిమాండ్‌ 2022 మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) 18 శాతం పడిపోయింది. 135.5 టన్నులుగా నమోదయ్యింది. 2021 ఇదే కాలంలో ఈ డిమాండ్‌ 165.8 టన్నులు. బంగారం ధరలు భారీగా పెరగడమే డిమాండ్‌ తగ్గడానికి కారణం. వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) ఈ మేరకు తాజా నివేదికను విడుదల చేసింది.  ‘గోల్డ్‌ డిమాండ్‌ ట్రెండ్స్‌ 2022 క్యూ1’ పేరుతో విడుదలైన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే...

► విలువ పరంగా జనవరి–మార్చి కాలంలో బంగారం డిమాండ్‌ 12 శాతం తగ్గి రూ.61,550 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది కాలంలో ఈ విలువ రూ.69,720 కోట్లు.  
► జనవరిలో బంగారం ధరలు పెరగడం ప్రారంభమైంది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 10 గ్రాముల ధర (పన్నులు లేకుండా) 8 శాతం పెరిగి రూ. 45,434కు చేరుకుంది.  ప్రధానంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దీనికి కారణం. 2021 జనవరి– మార్చి మధ్య ధర రూ.42,045గా ఉంది.  
► మార్చి త్రైమాసికంలో దేశంలో మొత్తం ఆభరణాల డిమాండ్‌ 26 శాతం తగ్గి 94.2 టన్నులకు పడిపోయింది. గతేడాది ఇదే కాలంలో ఇది 126.5 టన్నులు.
► ఈ ఏడాది తొలి త్రైమాసికంలో విలువ పరంగా ఆభరణాల డిమాండ్‌ 20 శాతం క్షీణించి రూ.42,800 కోట్లకు పడిపోయింది.                అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ.53,200 కోట్లు.  
► 2021 నాల్గవ త్రైమాసికంలో (అక్టోబర్‌–నవంబర్‌–డిసెంబర్‌) ధర రికార్డు స్థాయికి పెరిగిన        తర్వాత, భారత్‌ బంగారు ఆభరణాల డిమాండ్‌ ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో 26 శాతం తగ్గి 94 టన్నులకు పడిపోయింది. 2010 నుండి (మహమ్మారి కాలాలను మినహాయించి) భారత్‌ బంగారు ఆభరణాల డిమాండ్‌ 100 ట న్నుల దిగువకు పడిపోవడం ఇది మూడవసారి.  
► శుభ దినాల సందర్భాల్లో నెలకొన్న మహమ్మారి భయాలు, బంగారం ధరలు గణనీయంగా పెరగడం వంటి అంశాలు రిటైల్‌ డిమాండ్‌ తగ్గడానికి కారణం. ఆయా కారణాలతో కుటుంబాలు బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకున్నాయి.
► ఈ ఏడాది మొత్తంగా బంగారానికి డిమాండ్‌ 800–850 టన్నులు ఉండవచ్చు.  
► కాగా, మార్చి త్రైమాసికంలో బంగారం విషయంలో పెట్టుబడి డిమాండ్‌ 5 శాతం పెరిగి 41.3 టన్నులకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ పరిమాణం 39.3 టన్నులు.
► విలువ పరంగా బంగారం పెట్టుబడి డిమాండ్‌ 13 శాతం పెరిగి రూ.18,750 కోట్లకు                చేరుకుంది. ఇది 2021 అదే త్రైమాసికంలో రూ.16,520 కోట్లు.
► పెట్టుబడుల్లో  ప్రధానంగా బంగారు కడ్డీలు, నాణేలు ఉన్నాయి. వీటి డిమాండ్‌ 5 శాతం పెరిగి 41 టన్నులకు చేరింది.  ధరలు పెరగడం, ద్రవ్యోల్బణానికి విరుగుడుగా బంగారాన్ని ఎంచుకోవడం, ఈక్విటీ మార్కెట్లలో అస్థిరత వంటి అంశాలు పసిడి పెట్టుబడుల డిమాండ్‌కు మద్దతునిచ్చాయి.  
► రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో బంగారం కొనుగోళ్లను కొనసాగించింది. ఈ కాలంలో సెంట్రల్‌ బ్యాంక్‌ 8 టన్నులను కొనుగోలు చేసింది. సెంట్రల్‌ బ్యాంక్‌ 2017 చివరి నుండి                   బంగారాన్ని కొనుగోలు చేయడం ప్రారంభించింది. అప్పటి నుండి 200 టన్నులను             కొనుగోలు చేసింది.
► 2022 మొదటి త్రైమాసికంలో దేశంలో రీసైకిల్‌ అయిన మొత్తం బంగారం 88 శాతం పెరిగి 27.8 టన్నులకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో 14.8 టన్నులు.
► మార్చి త్రైమాసికంలో మొత్తం నికర బులియన్‌ దిగుమతులు గత ఏడాది ఇదే కాలంలో 313.9 టన్నుల నుంచి 58 శాతం తగ్గి 132.2 టన్నులకు పడిపోయాయి.

అంతర్జాతీయంగా మెరుపులు...
కాగా, మార్చి త్రైమాసికంలో అంతర్జాతీయంగా పసిడి డిమాండ్‌ 34 శాతం పెరిగి 1,234 టన్నులకు చేరింది. అంతర్జాతీయ ఉద్రిక్తలు, ఆర్థిక అనిశ్చితి, పెట్టుబడులకు సురక్షిత సాధనంగా ఇన్వెస్టర్లు పసిడివైపు చూడ్డం, వంటి అంశాలు దీనికి కారణం. ప్రత్యేకించి ఎలక్ట్రానిక్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌) నుంచి డిమాండ్‌ భారీగా వచ్చిందని నివేదిక గోల్డ్‌ డిమాండ్‌ ట్రెండ్స్‌ క్యూ1, 2022 నివేదిక పేర్కొంది. 2021 మొదటి త్రైమాసికంలో పసిడి డిమాండ్‌ 919.1 టన్నులు. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల దృష్ట్యా, అధిక ద్రవ్యోల్బణం, పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పెట్టుబడిదారులలో బంగారం కోసం డిమాండ్‌ వంటి అంశాలు యరో మెటల్‌కు ఆకర్షణ తీసుకుని వస్తాయిన డబ్ల్యూజీసీ సీనియర్‌ విశ్లేషకులు లూయిస్‌ స్ట్రీట్‌ పేర్కొన్నారు.  
      
పలు అంశాల ప్రభావం
ధరలపై మార్కెట్‌లో మిశ్రమ ధోరణి, చైనా నుంచి వస్తున్న వార్తల నేపథ్యంలో కోవిడ్‌పై అనిశ్చితి, ద్రవ్యోల్బణం భయాలు, భౌగోళిక సంఘర్షణలు వంటి అంశాలు పసిడి ధరను నిర్ణయిస్తాయి. భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగితే ధర మరింత పెరిగే అవకాశం ఉంది.   వీటితోపాటు గ్రామీణ మార్కెట్లలో డిమండ్‌ పునరుద్ధరణ, సాధారణ రుతుపవన అంశాలు కూడా యల్లో మెటల్‌ డిమాండ్‌పై ప్రభావం చూపుతాయి.  
– పీఆర్‌ సోమసుందరం, డబ్ల్యూజీసీ రీజినల్‌ సీఈఓ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top