
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) అరుదైన ఘనత సాధించింది. 24 గంటల వ్యవధిలో అత్యధిక సంఖ్యలో జీవిత బీమా పాలసీలను విక్రయించినందుకు గిన్నిస్ ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నట్లు కంపెనీ తెలిపింది.
‘‘ఈ ఏడాది జనవరి 20న మొత్తం 4,52,839 మంది ఏజెంట్లు 5,88,107 జీవిత బీమా పాలసీలను జారీ చేశారు. తద్వారా గిన్నిస్ రికార్డు సొంతమైంది. ఇది చరిత్రాత్మక విజయం. అంకితభావం గల ఏజెన్సీ నెట్‌వర్క్ అసాధారణ పనితీరును గిన్నిస్ వరల్డ్ రికార్డు గుర్తించింది’’ అని వివరించింది.
జనవరి 20న ’మ్యాడ్ మిలియన్ డే’ సందర్భంగా ఒక్కో ఏజెంట్ కనీసం ఒక్క పాలసీ అయినా జారీ చేయాలని ఎల్‌ఐసీ ఎండీ, సీఈఓ సిద్దార్థ మొహంతి విజ్ఞప్తి చేశారు. ఆ మేరకే గిన్నిస్‌ఫీట్‌ను ఎల్‌ఐసీ సొంతం చేసుకుంది. అరుదైన మైలురాయిని సాధించడం పట్ల కస్టమర్లు, ఏజెంట్లు, ఉద్యోగులకు మొహంతి కృతజ్ఞతలు తెలిపారు.