కోటక్‌ బ్యాంక్‌ కళకళ.. పెరిగిన లాభం | Kotak Mahindra Bank Reports 4pc Growth in Q3 Profit | Sakshi
Sakshi News home page

కోటక్‌ బ్యాంక్‌ కళకళ.. పెరిగిన లాభం

Jan 25 2026 11:05 AM | Updated on Jan 25 2026 12:15 PM

Kotak Mahindra Bank Reports 4pc Growth in Q3 Profit

ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో స్టాండెలోన్‌ ప్రాతిపదికన రూ. 3,446 కోట్ల లాభం ప్రకటించింది. గత క్యూ3లో నమోదైన రూ. 3,305 కోట్లతో పోలిస్తే 4 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం రూ. 16,050 కోట్ల నుంచి రూ. 16,741 కోట్లకు చేరింది. బ్యాంకు వడ్డీ ఆదాయం రూ. 13,428 కోట్ల నుంచి రూ. 13,903 కోట్లకు పెరిగింది.

నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) రూ. 7,196 కోట్ల నుంచి రూ. 7,565 కోట్లకు చేరినప్పటికీ నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 4.93 శాతం నుంచి 4.54 శాతానికి నెమ్మదించింది. అసెట్‌ క్వాలిటీకి సంబంధించి స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్‌పీఏ) నిష్పత్తి 1.50 శాతం నుంచి 1.30 శాతానికి, నికర ఎన్‌పీఏల నిష్పత్తి 0.41 శాతం నుంచి 0.31 శాతానికి దిగివచ్చాయి. అయితే, మొండిబాకీలకు కేటాయింపులు మాత్రం రూ. 794 కోట్ల నుంచి రూ. 810 కోట్లకు ఎగిశాయి.  

కన్సాలిడేటెడ్‌ ఫలితాలు.. 
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన బ్యాంకు లాభం రూ. 4,701 కోట్ల నుంచి 5 శాతం వృద్ధి చెంది రూ. 4,924 కోట్లకు చేరింది. కొత్త లేబర్‌ కోడ్‌కి సంబంధించి రూ. 98 కోట్ల వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకోవడంతో లాభంపై ప్రభావం పడినట్లు బ్యాంకు తెలిపింది. డిసెంబర్‌ 31 నాటికి నిర్వహణలోని మొత్తం కస్టమర్‌ అసెట్స్‌ పరిమాణం రూ. 6,85,134 కోట్ల నుంచి రూ. 7,87,950 కోట్లకు చేరింది.  

క్రెడిట్‌ కార్డ్‌ విభాగంలో క్షీణత.. 
వార్షిక ప్రాతిపదికన క్రెడిట్‌ కార్డ్‌ విభాగం క్షీణించినట్లు కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఎండీ అశోక్‌ వాస్వాని తెలిపారు. కొత్త ప్రోడక్టులను ప్రవేశపెట్టడం ద్వారా వ్యాపారాన్ని మెరుగుపర్చుకోవడంపై కసరత్తు చేస్తున్నట్లు వివరించారు. అటు నిర్మాణ పరికరాల రంగం కూడా నెమ్మదించినట్లు చెప్పారు. స్టాండర్డ్‌ చార్టర్డ్‌ నుంచి కొనుగోలు చేసిన పర్సనల్‌ లోన్‌ పోర్ట్‌ఫోలియో ఊహించిన దానికన్నా మెరుగ్గా రాణిస్తున్నట్లు వివరించారు.

నాలుగో త్రైమాసికంలో మార్జిన్లు ఒక మోస్తరుగానే వృద్ధి చెందే అవకాశం ఉందని బ్యాంక్‌ గ్రూప్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌వో) దేవాంగ్‌ ఘీవాలా తెలిపారు. క్రెడిట్‌ కార్డులు, మైక్రోఫైనాన్స్, వ్యక్తిగత రుణాల విభాగాల్లో స్లిపేజీలు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. అయితే, స్లిపేజీలు అధికంగా ఉన్న రిటైల్‌ కమర్షియల్‌ వెహికల్‌ విభాగంపై అప్రమత్తంగా ఉన్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement