కియా కొత్త కార్లు.. లాంచ్‌కు ముందే బుకింగ్‌లు | Kia Carens Clavis CNG Carnival Hybrid Bookings Open Launch Soon | Sakshi
Sakshi News home page

కియా కొత్త కార్లు.. లాంచ్‌కు ముందే బుకింగ్‌లు

Sep 11 2026 1:55 PM | Updated on Sep 11 2026 2:13 PM

Kia Carens Clavis CNG Carnival Hybrid Bookings Open Launch Soon

దేశంలో ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలకు డిమాండ్‌ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కియా ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తన మూడు వరుసల ఎమ్‌పీవీ (MPV) శ్రేణిలో కొత్త పవర్‌ట్రెయిన్ ఆప్షన్లను తీసుకొస్తోంది. ఇందులో భాగంగా కియా కారెన్స్ సీఎన్‌జీ (Carens CNG), కారెన్స్ క్లావిస్ సీఎన్‌జీ (Carens Clavis CNG), కార్నివాల్ లిమోసిన్ హైబ్రిడ్ (Carnival Limousine Hybrid) మోడళ్లకు ప్రీ-బుకింగ్స్‌ను ప్రారంభించింది. ఈ మూడు వాహనాలను కియా అధీకృత డీలర్ నెట్‌వర్క్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అయితే వీటి ధరలు, ఖచ్చితమైన లాంచ్ తేదీలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సీఎన్‌జీతో..

కారెన్స్, కారెన్స్ క్లావిస్ సీఎన్‌జీ వెర్షన్లలో 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. వీటికి ఫ్యాక్టరీలోనే అమర్చిన 60-లీటర్ సీఎన్‌జీ ట్యాంక్ ఉంటుంది. సీఎన్‌జీ మోడ్‌లో ఇంజిన్ అవుట్‌పుట్ సుమారు 93–95 హెచ్‌పీ, టార్క్ 123 Nmగా ఉంటుంది. క్లావిస్ సీఎన్‌జీకి అధికారికంగా వెల్లడైన ఇంధన సామర్థ్యం (మైలేజీ) ఒక కేజీకి 25 కిలో మీటర్లు.

గతంలో కొన్ని మార్కెట్లలో కనిపించిన డీలర్-ఫిట్టెడ్ సీఎన్‌జీ కిట్లకు భిన్నంగా, కొత్త మోడళ్లలో సీఎన్‌జీ వ్యవస్థను కియా ఫ్యాక్టరీ స్థాయిలోనే వాహనానికి అనుగుణంగా రూపొందించింది. సీఎన్‌జీ కోసం ప్రత్యేక ఇంజిన్ కాలిబ్రేషన్, సవరించిన సస్పెన్షన్ ట్యూనింగ్, అదనపు బరువుకు అనుగుణంగా బ్రేకింగ్ సెటప్ వంటి మార్పులు చేసింది. 16-అంగుళాల వీల్స్, పెట్రోల్-టు-సీఎన్‌జీ మార్పు కోసం ప్రత్యేక స్విచ్, సీఎన్‌జీ డిస్టెన్స్-టు-ఎంప్టీ సమాచారాన్ని చూపించే 4.2-అంగుళాల కలర్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే కూడా ఉన్నాయి.

సీఎన్‌జీ ట్యాంక్‌ను అమర్చినప్పటికీ ప్రయాణికులకు ఉపయోగపడే స్థలాన్ని సాధ్యమైనంత వరకు ఆదా చేసేందుకు కియా ఇంజినీరింగ్ మార్పులు చేసింది. సీఎన్‌జీ వెర్షన్లలో బూట్ స్పేస్ 116 లీటర్లుగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

ఏ వేరియంట్లలో వస్తాయి?

కారెన్స్ సీఎన్‌జీ ప్రైవేట్ కొనుగోలుదారుల కోసం ప్రీమియం (O) G1.5 6MT వేరియంట్‌లో రానుంది. B2B, కమర్షియల్ మొబిలిటీ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని M-Drive G1.5 6MT వెర్షన్‌ను కూడా కియా అందించనుంది.

కారెన్స్ క్లావిస్ సీఎన్‌జీ HTE, HTE (O) G1.5 6MT వేరియంట్లలో లభించనుంది. కమర్షియల్, ఫ్లీట్ వినియోగదారుల కోసం HTM G1.5 6MT వెర్షన్‌ను కూడా తీసుకురానున్నట్లు సమాచారం.

సీఎన్‌జీ వెర్షన్లు ప్రస్తుతం ఉన్న పెట్రోల్, డీజిల్ ఆప్షన్లకు అదనంగా చేరనున్నాయి. ఇప్పటికే కారెన్స్ క్లావిస్‌కు ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా ఉండటంతో, ఒకే మోడల్ కుటుంబంలో పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వంటి విభిన్న పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌లను కియా అందిస్తోంది.

కార్నివాల్‌కు హైబ్రిడ్ పవర్

కియా తన ప్రీమియం ఎంపీవీ ‘కార్నివాల్ లిమోసిన్’లో తొలిసారిగా హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను తీసుకొస్తోంది. ఇది Limousine+ G1.6T HEV 6AT రూపంలో అందుబాటులోకి రానుంది. 1.6-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 180 హెచ్‌పీ, 265 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 73.4 హెచ్‌పీ, 304 Nm టార్క్ అందించే ఎలక్ట్రిక్ మోటార్ జతవుతుంది. 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఈ హైబ్రిడ్ వ్యవస్థ పనిచేస్తుంది.

ప్రస్తుతం భారత్‌లో కార్నివాల్ 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. హైబ్రిడ్ వెర్షన్ ఆ డీజిల్ మోడల్‌కు ప్రత్యామ్నాయంగా కాకుండా అదనపు పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌గా రానుంది. దీంతో పెద్ద, ప్రీమియం ఎంపీవీ కోరుకునేవారికి పెట్రోల్-ఎలక్ట్రిక్ హైబ్రిడ్ ఆప్షన్‌ కూడా లభించనుంది.

ప్రీమియం ఫీచర్లకు పెద్దపీట

కార్నివాల్ హైబ్రిడ్‌లో 18-అంగుళాల క్రిస్టల్ కట్ డ్యూయల్-టోన్ ఏరో అల్లాయ్ వీల్స్, యాక్టివ్ ఎయిర్ ఫ్లాప్స్, వర్చువల్ ఇంజిన్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉంటాయి. క్యాబిన్‌లో AQI డిస్‌ప్లేతో స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్‌లెస్ ఛార్జింగ్‌తో రిట్రాక్టబుల్ సీట్‌బ్యాక్ టేబుల్స్, కప్‌హోల్డర్లు, మోనోటోన్ యాంబియంట్ లైటింగ్, లెథరెట్ డోర్ ట్రిమ్స్ వంటి సౌకర్యాలు లభించనున్నాయి.

కారెన్స్, కారెన్స్ క్లావిస్ సీఎన్‌జీ మోడళ్ల ధరలను సెప్టెంబర్ చివర్లో లేదా అక్టోబర్ ప్రారంభంలో ప్రకటించే అవకాశం ఉందని తాజా ఆటోమొబైల్ నివేదికలు చెబుతున్నాయి. కార్నివాల్ హైబ్రిడ్ ధర కూడా లాంచ్‌కు దగ్గరగా వెల్లడయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement